ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. సిద్ధం కండి : సునీల్ బన్సల్ 

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. సిద్ధం కండి : సునీల్ బన్సల్ 
  • ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. సిద్ధం కండి 
  • నెలలో 4 రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాలి: సునీల్ బన్సల్ 
  • ఫిబ్రవరిలోగా ‘‘ప్రజాగోస-బీజేపీ భరోసా’’ పూర్తి చేయాలె 
  • బీజేపీ ఆఫీసు బేరర్ల మీటింగ్​లో నేతలకు దిశానిర్దేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సూచించారు. ‘‘పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి” అని దిశానిర్దేశం చేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ అధ్యక్షతన ఆఫీస్ బేరర్ల మీటింగ్ జరిగింది. ఆఫీస్ బేరర్లు, జిల్లాల అధ్యక్షులు, ఇన్‌‌చార్జ్ లు, కొత్తగా నియమితులైన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్​చార్జ్​లు పాల్గొన్నారు. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా శక్తి కేంద్రాల పనితీరు, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బన్సల్ చర్చించారు.

బూత్ కమిటీలపై ఆరా తీశారు. కొత్తగా నియమితులైన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్​చార్జ్​లకు తమ బాధ్యతలేంటో చెప్పారు. నెలకు 4 రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాలని, బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘‘ప్రజాగోస–బీజేపీ భరోసా’’ కార్యక్రమం పూర్తవ్వని నియోజకవర్గాల్లో వచ్చే నెల  8 నుంచి 10లోపు ప్రారంభించి ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలన్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి కార్యక్రమం నిర్వహించాలన్నారు. 

అసెంబ్లీ ఇన్​చార్జ్​లు పోటీ చేయొద్దు.. 

అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్​చార్జ్​లు ఎన్నికల్లో పోటీ చేయొద్దని బన్సల్ చెప్పడంతో గందరగోళం ఏర్పడింది. అయితే, తాము పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల్లో పోటీ కుదరదని మరోసారి చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, కో ఇన్ చార్జ్ అర్వింద్ మీనన్, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఎంపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.