
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచాక ఇద్దరూ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పగా.. ఇటీవలే టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు తెలిపి షాక్ కు గురి చేశారు. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాలు లేకుండానే భారత్ టీ20, టెస్ట్ క్రికెట్ ఆడనుంది. అయితే వన్డే క్రికెట్ లో మాత్రం మరో రెండేళ్లు కొనసాగనున్నారు. దీనికి కారణం లేకపోలేదు. సౌతాఫ్రికా వేదికగా 2027లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రోకో జోడీ హింట్ కూడా ఇచ్చారు. ఫ్యాన్స్ కు కూడా ఈ విషయం ఊరట కలిగించేదే.
ఈ సమయంలో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ జోడీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 2027 వన్డే ప్రపంచ కప్‌కు భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఉండరని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ భావిస్తున్నారు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, మరో రేండేళ్లు వారు క్రికెట్ లో కొనసాగడం అవకాశం లేదని తెలిపారు.
"కోహ్లీ, రోహిత్ కు వన్డే ఫార్మాట్ లో మంచి రికార్డ్ ఉంది. సెలక్షన్ కమిటీ 2027 ప్రపంచ కప్‌ను పరిశీలిస్తుంది. వారు '2027 ప్రపంచ కప్‌కు జట్టులో ఉండగలరా? అని పరిశీలిస్తారు. సెలక్షన్ కమిటీ వారు ఆసమయానికి జట్టులో ఉండగలరు అని భావిస్తే వరల్డ్ కప్ కు సిద్ధంగా ఉంటారు". అని స్పోర్ట్స్ టుడేతో అన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ఏమిటని గవాస్కర్ అడిగినప్పుడు, వారిద్దరూ భారత జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకోగలగడం అసంభవమని చెప్పుకొచ్చాడు.
" వాళ్లిద్దరూ ఆడతారని నేను అనుకోవడం లేదు. నేను చాలా నిజాయితీగా చెబుతున్నాను. కానీ, ఎవరికి తెలుసు వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత వారి కంటే మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు ఉంటే.. వారు కూడా వరుస సెంచరీలు చేస్తే అవకాశం వస్తుంది". అని గవాస్కర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడే సమయానికి రోహిత్ వయసు 40 సంవత్సరాలు కాగా, విరాట్ వయసు 38 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయానికి విరాట్ కోహ్లీ అందుబాటులో ఉన్నప్పటికీ.. రోహిత్ ఫిట్‌నెస్ ఆందోళనగా ఉంటుంది.
Sunil Gavaskar doubts Virat Kohli and Rohit Sharma will play in the 2027 ODI World Cup unless they score multiple centuries. pic.twitter.com/yqSZ2InfaV
— CricTracker (@Cricketracker) May 13, 2025