రేవంత్, భట్టితో సునీల్​ కనుగోలు భేటీ

రేవంత్, భట్టితో సునీల్​ కనుగోలు భేటీ

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, మెజారిటీ స్థానాల్లో గెలుపు, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్​ పార్టీ వేగం పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో.. లోక్​సభ ఎలక్షన్​లోనూ టార్గెట్​ 17గా పెట్టుకుని పనిచేస్తున్నది. అందులో భాగంగా కాంగ్రెస్​ పార్టీ వ్యూహకర్త సునీల్​ కనుగోలు కూడా పార్టీకి వ్యూహాలను రచిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డితో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు.

రేవంత్​తో గంట.. భట్టి, రాజగోపాల్​రెడ్డితో అరగంటపాటు ఆయన చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా సునీల్​ కనుగోలు తన సర్వే నివేదికలను రేవంత్, భట్టికి అందజేసినట్టు సమాచారం. దక్షిణ తెలంగాణలోని లోక్​సభ సెగ్మెంట్లలో పార్టీ బలంగా ఉందని, ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని సునీల్​ కనుగోలు చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణపైనా ఫోకస్​ పెంచాల్సిందిగా సూచనలు చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. క్షేత్రస్థాయిలో ఇతర పార్టీల్లోని లోకల్​ క్యాడర్ ​కాంగ్రెస్​లోకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తే పార్టీకి లాభమని ఆయన సూచించారని చెప్తున్నారు. 

త్వరలో వార్​ రూమ్​ మీటింగ్స్.. 

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, వాటి అమలు కు ఏఐసీసీ ఇప్పటికే వార్​ రూమ్​ను ఏర్పాటు చేసింది. చైర్మన్, సభ్యులనూ నియమించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే గాంధీభవన్​లో వార్​ రూమ్​ మీటింగ్స్​​నిర్వహించాలని సునీల్​ కనుగోలు డిసైడ్​ అయినట్టు తెలుస్తున్నది. అన్ని జిల్లాల సోషల్​ మీడియా ఇన్​చార్జ్​లు, డీసీసీ చీఫ్​లు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియమించిన స్ట్రాటజీ కమిటీలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. లోక్​సభ ఎన్నికల కోసం సోషల్​ మీడియాను బాగా వినియోగించుకోవాలని సునీల్​ కనుగోలు సూచిస్తున్నట్టు తెలిసింది.

రాష్ట్రంలో కనీసం 15 సీట్లు గెలిచేలా ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిందిగా దీపాదాస్​ మున్షీ పార్లమెంట్​ అబ్జర్వర్లకు సూచించినట్టు సమాచారం. శుక్రవారం గాంధీభవన్​ వార్​ రూమ్​ నుంచి ఆమె పార్లమెంట్​ అబ్జర్వర్లతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. 70 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలిచ్చిన విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిందిగా ఆమె వారికి సూచించినట్టు తెలిసింది.