- నివాసాల ముసుగులో పెద్దసంఖ్యలో బోర్లు
- ప్రమాదకర లోహాలున్న నీళ్లు హాస్టళ్లు, హోటళ్లకు సప్లై
- హైడ్రా, రెవెన్యూ, సీఎంసీ జాయింట్ ఆపరేషన్
- 15 బోర్లు తొలగింపు.. మరికొన్నింటి కనెక్షన్లు కట్
- క్రిమినల్ కేసులు.. ట్యాంకర్ల సీజ్‌కు హైడ్రా సిద్ధం
హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువు చుట్టూ బోర్లు.. ఇండ్లలో మోటార్లు.. భూగర్భంలో వందల మీటర్ల పైపులైన్లు! ఇలా మాదాపూర్‌లోని సున్నం చెరువును ఆనుకొని ఏండ్లుగా నీళ్ల దందా సాగిస్తున్నది ఓ ముఠా. సుమారు 30 మంది ముఠాగా ఏర్పడి రోజూ 300 నుంచి 400 ట్యాంకర్ల నీటిని తోడేస్తూ అమ్ముకుంటున్నరు. నివాసాల ముసుగులో బోర్లు వేసి, ప్రమాదకర లోహాలున్న నీటిని సైతం హాస్టళ్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా, రెవెన్యూ, సీఎంసీ, జలమండలి అధికారులు శనివారం ఉదయం 6.30 గంటలకు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించి సాయంత్రం వరకు కొనసాగించారు. ఇందులో భాగంగా 15 బోర్లను పూర్తిగా తొలగించగా, మరికొన్నింటి మోటార్లు, విద్యుత్ వైర్లు, పైపులైన్లను తొలగించారు. అక్రమ దందా సాగిస్తున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు ట్యాంకర్లను సీజ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం
సున్నం చెరువు అభివృద్ధిలో భాగంగా 10 అడుగుల మేర పేరుకు పోయిన వ్యర్థాలను తొలగించడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు పరిస్థితులు మెరుగయ్యాయి. అయితే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద సంఖ్యలో బోర్లు వేసి నీటిని తోడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. గతంలో 60 అడుగుల లోతులోనే పుష్కలంగా నీరు లభించేదని, ఇప్పుడు 600 అడుగుల వరకు తవ్వినా నీరు పడటం లేదని స్థానికులు చెబుతున్నారు. బోర్లు ఎండిపోవడం, నీటిని తోడే క్రమంలో మోటార్లు కాలిపోవడంతో తామూ డబ్బులు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీరు కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో నవభారత్‌నగర్, బోరబండ ఫేజ్-3 ప్రాంతాల్లో అధికారులు అక్రమ బోర్ల తొలగింపు చేపట్టారు. హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదకర లోహాలున్నా సరఫరా
సున్నం చెరువు పరిసరాల్లోని కొన్ని బోర్ల నీటిని గతంలో కాలుష్య నియంత్రణ మండలి పరీక్షించగా, కాడ్మియం, సీసం, నికెల్ వంటి భారీ లోహాలు ఉన్నట్లు గుర్తించారని హైడ్రా పేర్కొంది. ఈ నీటిని మాదాపూర్‌లోని కొన్ని హాస్టళ్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో అధికారులు దృష్టి సారించారు. కలుషిత నీటిని తాగితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున నీటి నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల నివేదికలు, సరఫరా వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
సామాన్యులకు ఇబ్బందులు
సున్నం చెరువు చుట్టూ బోర్లు వేసి అక్రమంగా నీటిని విక్రయిస్తున్న కొందరి వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 30 మందితోపాటు బోర్లు వేసినవారిపై క్రిమినల్ కేసులు పెడతాం. ట్యాంకర్లను సీజ్ చేస్తాం. రెవెన్యూ అధికారులతో వాల్టా కింద కేసులు నమోదు చేయిస్తాం. మరెక్కడైనా ఇలా అక్రమంగా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
