సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్తో మార్కరమ్ ఒప్పందం

సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్తో మార్కరమ్ ఒప్పందం

ఐపీఎల్ ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా టీ20 లీగ్లో  అడుగుపెట్టబోతున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ కాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్,  లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లో జట్లను కొనుగోలు చేయగా...సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఓ జట్టును దక్కించుకుంది.  పోర్ట్ ఎలిజబెత్ ఆధారిత ఫ్రాంచైజీని కొనుక్కున్న సన్ రైజర్స్..ఈ టీమ్కు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరు పెట్టింది.  అంతేకాకుండా సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ మార్కరమ్ తో ఒప్పందం కూడా చేసుకుంది. అతను ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్. ఐపీఎల్లో అతను 14 మ్యాచుల్లో  381 రన్స్ సాధించాడు. అటు డెత్‌ఓవర్ల బౌలింగ్‌ స్పెషలిస్టు ఒట్‌నీల్‌ బార్టమన్‌తోనూ ఒప్పందం చేసుకుంది. 

మొత్తం ఆరు టీమ్స్..
సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ టీ20లో ఆరు టీమ్స్ ఉండనున్నాయి.  కేప్‌టౌన్‌, జోహెన్నెస్‌బర్గ్‌, డర్బన్‌, పోర్ట్‌ ఎలిజిబెత్‌, ప్రిటోరియా, పార్ల్‌ పేరుతో ఉన్న ఫ్రాంచైజీలను ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేశాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ టీ20 లీగ్‌ నిర్వహించాలని సీఎస్‌ఏ యోచిస్తోంది. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌ దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్‌ గ్రేమీ స్మిత్‌ను కమిషనర్‌గా ఆ దేశ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఇప్పటికే సీఎస్‌ఏలో డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా స్మిత్ విధులు నిర్వర్తిస్తున్నాడు. దక్షిణాఫ్రికాలో క్రికెట్‌ను జాతీయంగా మరింత పటిష్టంగా తయారు చేయాలనే లక్ష్యంతో టీ20 లీగ్‌కు శ్రీకారం చుట్టింది.

ఫ్రాంచైజీలకు సంతకం చేసిన ఆటగాళ్లు..
చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ తరపున  ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, మహేశ్ తీక్షణ, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ ఆడనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అయిన ప్రిటోరియా క్యాపిటల్స్ లో  అన్రిచ్ నోర్జ్, మిగెల్ ప్రిటోరియస్ స్థానం దక్కించుకున్నారు. ముంబై ఇండియన్స్ టీమ్ఎంఐ కేప్ టౌన్ జట్టులో  రషీద్ ఖాన్, కగిసో రబడా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్ భాగస్వామ్యమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన పార్ల్ రాయల్స్ తో  జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, ఒబెడ్ మెక్‌కాయ్, కార్బిన్ బాష్ ఒప్పందం చేసుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు ఐడెన్ మార్క్‌రామ్, ఒట్నీల్ బార్ట్‌మాన్ సంతకం చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ డర్బన్ సూపర్ జెయింట్స్ కు  క్వింటన్ డి కాక్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టాప్లీ, ప్రేనెలన్ సుబ్రాయెన్ సైన్ చేశారు.