దెబ్బకు దెబ్బ..  ఢిల్లీని ఓడించిన సన్‌ రైజర్స్ 

దెబ్బకు దెబ్బ..  ఢిల్లీని ఓడించిన సన్‌ రైజర్స్ 

న్యూఢిల్లీ:  వరుసగా మూడు ఓటముల తర్వాత సన్‌‌‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ మళ్లీ విజయాల బాట పట్టింది. గత పోరులో తమను ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను దెబ్బకు దెబ్బ కొట్టింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో రైజర్స్‌‌ 9  రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించి లీగ్‌‌లో మూడో విజయం సాధించింది.  అభిషేక్‌‌ శర్మ (36 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 67), హెన్రిచ్‌‌ క్లాసెన్‌‌ (27 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 నాటౌట్‌‌) ఫిఫ్టీలతో చెలరేగడంతో తొలుత సన్‌‌ రైజర్స్ 20 ఓవర్లలో 197/6 స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌‌ మార్ష్ 4 వికెట్లు పడగొట్టాడు.  ఛేజింగ్‌‌లో ఢిల్లీ 20 ఓవర్లలో  188/6 స్కోరు మాత్రమే చేసి ఓడింది. మిచెల్‌‌ మార్ష్‌‌ (39 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 6 సిక్సర్లతో 63), ఫిల్‌‌ సాల్ట్‌‌ (35 బాల్స్‌‌లో 9 ఫోర్లతో 59) పోరాడారు. మయాంక్ మార్కండే రెండు వికెట్లతో రాణించాడు.మార్ష్​కు ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.

అభిషేక్‌‌, క్లాసెన్‌‌ కమాల్‌‌

స్టార్టింగ్‌‌లో యంగ్‌‌స్టర్‌‌ అభిషేక్‌‌ శర్మ, చివర్లో క్లాసెన్‌‌ హిట్టింగ్‌‌తో సన్‌‌రైజర్స్‌‌ భారీ స్కోరు చేయగలిగింది. టాస్‌‌ నెగ్గిన రైజర్స్‌‌ బ్యాటింగ్‌‌ ఎంచుకోగా.. పవర్‌‌ ప్లేలో అభిషేక్‌‌ వరుస బౌండ్రీలతో హోరెత్తించాడు.  మూడో ఓవర్లో మయాంక్‌‌ అగర్వాల్ (5)ను ఇషాంత్‌‌, ఐదో ఓవర్లో  త్రిపాఠి (10)ని మార్ష్‌‌ ఔట్​ చేసినా.. అభిషేక్​  జోరు చూపెట్టాడు. ఇషాంత్‌‌ వేసిన ఆరో ఓవర్లో 4  ఫోర్లతో విజృంభించడంతో పవర్‌‌ప్లేను సన్‌‌రైజర్స్‌‌ 62/2తో ముగించింది. ఆ వెంటనే స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ బౌలింగ్‌‌లో భారీ సిక్స్‌‌ కొట్టిన అతను 25 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకున్నాడు.  పదో ఓవర్లో మూడు బాల్స్ తేడాలో కెప్టెన్‌‌ మార్‌‌క్రమ్‌‌ (8), హిట్టర్‌‌ హ్యారీ బ్రూక్‌‌ (0)ను ఔట్‌‌ చేసిన మిచెల్‌‌ మార్ష్‌‌  హైదరాబాద్‌‌కు డబుల్‌‌ షాక్‌‌ ఇచ్చాడు. ముకేశ్‌‌ వేసిన తర్వాతి ఓవర్లో అభిషేక్‌‌ రెండు ఫోర్లు, క్లాసెన్‌‌ 4,6 రాబట్టడంతో స్కోరు వంద దాటింది. కానీ,  జోరు మీదున్న అభిషేక్‌‌ను అక్షర్‌‌ పెవిలియన్ చేర్చడంతో  రైజర్స్‌‌ 109 రన్స్‌‌కే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అబ్దుల్‌‌ సమద్‌‌ (28) సపోర్ట్‌‌తో క్లాసెన్‌‌ ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు.  స్లాగ్‌‌ ఓవర్లలో  ఢిల్లీ బౌలర్లను ఎటాక్‌‌ చేశాడు. అక్షర్‌‌ వేసిన 16వ ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లతో జోరు పెంచాడు. మార్ష్‌‌ బౌలింగ్‌‌లో సిక్స్‌‌ కొట్టిన సమద్‌‌ ఔటైనా.. అకీల్‌‌ హొస్సేన్ (16 నాటౌట్)తో కలిసి చివరి మూడు ఓవర్లలో 35 రన్స్‌‌ రాబట్టి మంచి ఫినిషింగ్‌‌ ఇచ్చిన క్లాసెన్‌‌ ఫిఫ్టీ  కూడా పూర్తి చేసుకున్నాడు.

మార్ష్‌‌, ఫిల్‌‌ దంచినా..

బౌలింగ్‌‌లో మెప్పించిన మిచెల్‌‌ మార్ష్‌‌  ఛేజింగ్​లో బ్యాట్‌‌తోనూ దంచికొట్టాడు. అతనికి తోడు ఫిల్‌‌ సాల్ట్‌‌ భారీ షాట్లతో వణికించినా సన్‌‌ రైజర్స్‌‌ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని టీమ్‌‌ను గెలిపించారు. ఇన్నింగ్స్‌‌ రెండో బాల్‌‌కే కెప్టెన్‌‌ వార్నర్ (0)ను బౌల్డ్‌‌ చేసిన భువనేశ్వర్‌‌ ప్రత్యర్థికి షాకిచ్చాడు. కానీ, మరో ఓపెనర్‌‌ ఫిల్‌‌ సాల్ట్‌‌కు తోడైన మార్ష్‌‌ సిక్సర్లతో రెచ్చిపోయాడు.. స్పీడ్‌‌స్టర్‌‌ ఉమ్రాన్‌‌ వేసిన ఏడో ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లు బాదగా.. సాల్ట్‌‌ రెండు ఫోర్లతో 22 రన్స్‌‌ వచ్చాయి. అదే జోరుతో ఇద్దరూ ఫిఫ్టీలు పూర్తి చేసుకోగా..11 ఓవర్లకు 111/1తో నిలిచిన ఢిల్లీ ఈజీగా గెలిచేలా కనిపించింది. ఈ టైమ్‌‌లో సన్‌‌ రైజర్స్ బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఢిల్లీ జోరుకు బ్రేక్‌‌ వేశారు. 12వ ఓవర్లో రిటర్న్‌‌ క్యాచ్‌‌తో సాల్ట్‌‌ను ఔట్‌‌ చేసిన మార్కండే ఈ జోడీని విడదీయగా.. అభిషేక్‌‌ బౌలింగ్‌‌లో మనీష్‌‌ పాండే (1) స్టంపౌటయ్యాడు. అకీల్‌‌ బౌలింగ్‌‌లో భారీ సిక్స్‌‌ కొట్టిన మార్ష్‌‌ మరో షాట్‌‌కు ట్రై చేసిన మార్‌‌క్రమ్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. 30 బాల్స్‌‌లో ఢిల్లీకి 60 రన్స్‌‌ అవసరం అవగా.. ఢిల్లీ వికెట్ల పతనం ఆగలేదు. ప్రియం గార్గ్‌‌ (12)ను మార్కండే, ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ సర్ఫరాజ్‌‌ ఖాన్‌‌ (9)ను నటరాజన్ బౌల్డ్‌‌ చేయడంతో 148/6తో ఢిల్లీ డీలా పడింది. చివర్లో అక్షర్‌‌ పటేల్‌‌ (29 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.