SRH vs LSG: దుమ్మురేపిన సన్ రైజర్స్..లక్నోకు భారీ టార్గెట్

SRH vs LSG: దుమ్మురేపిన సన్ రైజర్స్..లక్నోకు భారీ టార్గెట్

సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచులో భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 182  పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ చిచ్చరపిడుగులా చెలరేగగా...అబ్దుల్ సమద్ బ్యాట్ ఝుళిపించడంతో  సన్ రైజర్స్  భారీ స్కోరు చేసింది. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ (7) యుధ్ వీర్ సింగ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి అన్ మోల్ ప్రీత్ సింగ్ తో కలిసి జట్టును ఆదుకున్నాడు. రెండో వికెట్ కు 37 పరుగులు జోడించాడు. అయితే యశ్ ఠాకూర్ బౌలింగ్ లో రాహుల్ త్రిపాఠీ (20) వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మార్కరమ్ (28) పర్వాలేదనిపించాడు. అయితే 82 పరుగల వద్ద అన్ మోల్ ప్రీత్ సింగ్ (36) ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ మార్కరమ్ కూడా పెవీలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 115 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

క్లాసెన్ ఖతర్నాక్ ఇన్నింగ్స్

ఈ సమయంలో సన్ రైజర్స్ ను హెన్రిచ్ క్లాసెన్ ఆదుకున్నాడు. అబ్దుల్ సమద్ తో కలిసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. కేవలం 26 బంతుల్లో 3 సిక్సులు, 3 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. ఇతనికి సమద్ 25 బంతుల్లో 4 సిక్సులు, ఒక ఫోర్ తో 37 పరుగులు చేసి సహకరించాడు. వీరిద్దరు 6 వికెట్ కు 58 పరుగులు జతచేశారు.  లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్యా 2 వికెట్లు దక్కించుకున్నాడు.ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, యుధ్ వీర్ సింగ్ ఒక్కో వికెట్ పడటగొట్టారు.