SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్

SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరుగులేకుండా పోతుంది. ఓటమితో టోర్నీని ప్రారంభించిన కమ్మిన్స్ సేన ఆ తర్వాత జరిగిన 6 మ్యాచ్ ల్లో 5 విజయాలను తమ ఖాతాలో వేసుకుంది. సాధారణంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఓడిపోతూ ఉంటాయి. కానీ సన్ రైజర్స్ కు ఆ భయం లేదు. ప్రారంభం నుంచే అగ్రెస్సివ్ గా ఆడుతూ ప్రత్యర్థికి కొండంత లక్ష్యాన్ని బోర్డు మీద ఉంచుతుంది. 200 స్కోర్ కొట్టడమే కష్టమైతే 250 పరుగులు అలవోకగా కొట్టేస్తుంది.

సన్ రైజర్స్ ఆటగాళ్ల ఊచకోతకు వీరు లైవ్ మ్యాచ్ ఆడుతున్నారా.. లేకపోతే మనం హైలెట్స్ చూస్తున్నామా అనే అనుమానం కలగక మానదు. హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే.. క్లాసన్ మిడిల్ ఆర్డర్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. వీరికి తోడు షాబాజ్, నితీష్ కుమార్, అబ్దుల్ సమద్ సైతం బ్యాట్ ఝళిపిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. మరో మూడు మ్యాచ్ ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు వెళ్తుంది.

Also Read:చెన్నైకు స్టోయినీస్ చెక్.. ఒక్క మ్యాచ్‌తో మూడు రికార్డ్స్ బ్రేక్

ఈ నేపథ్యంలో రేపు (ఏప్రిల్ 25) ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కీలక పోరుకు సిద్ధమైంది. టోర్నీలో ఆర్సీబీ బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏ జట్టుతో మ్యాచ్ ఆడినా భారీగా పరుగులు సమర్పించుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. మరోవైపు సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ లో అదరగొడుతుంది. ప్రత్యర్థి ఎవరైనా భారీ స్కోర్ కొట్టేస్తుంది. దీంతో ఆర్సీబీ  బౌలర్లను మరోసారి సన్ రైజర్స్ చేతిలో బలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. 

ఇప్పటికే టోర్నీలో 250 పరుగులకు పైగా మూడు సార్లు కొట్టేసిన సన్ రైజర్స్.. ఆర్సీబీపై మొదట బ్యాటింగ్ చేస్తే 300 కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదైనా అభిమానులకు ఈ మ్యాచ్ లో ఫుల్ కిక్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బెంగళూరు ఆడిన 8 మ్యాచ్ ల్లో ఒకటే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.