- అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో 3.7 డిగ్రీల దాకా పెరిగే చాన్స్
- సముద్రగర్భాల్లో సాధారణం కన్నా 10 డిగ్రీల అధిక వేడి
- వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా కొనసాగే అవకాశం
- ఇండియాలో డిసెంబర్ వరకు తక్కువ వానలే
- ప్రపంచవ్యాప్తంగా కరువు, వేడి ముప్పు తీవ్రం
- 1950 తర్వాత ఇది అత్యంత తీవ్రమైన ఎల్ నినో
వాషింగ్టన్: ప్రపంచాన్ని ‘సూపర్ డూపర్ ఎల్‌నినో’ వణికించబోతున్నది. దీని ప్రభావంతో వేడి క్రమంగా పెరుగుతూ భూగోళం ఎరుపెక్కుతున్నది. 1950 తర్వాత నమోదైన అత్యంత తీవ్రమైన ఎల్‌నినోల్లో ఇదొకటి అని ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. ఇప్పటికే భూగోళం రికార్డు స్థాయిలో వేడెక్కుతుండగా.. దీనికి ఎల్‌నినో ఎఫెక్ట్తోడవుతున్నది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎల్‌నినో సెంటర్(కేంద్రం) అయిన సెంట్రల్, ఈస్ట్ ట్రాపికల్ పసిఫిక్‌లో మహాసముద్ర ఉపరితల టెంపరేచర్లు సాధారణం కంటే 3.7 డిగ్రీలు పెరుగుతాయని డబ్ల్యూఎంవో అంచనా వేస్తున్నది. అలాగే సముద్రం లోతుల్లో దాగిన వేడి కూడా పైకి వస్తుండగా.. ఉపరితలంపై ఉన్న వేడి కూడా వాతావరణంలోకి విడుదలవుతోంది. దీంతో చలికాలంలోనూ వేడి ప్రభావం కొనసాగనుంది.
గత రికార్డును బద్దలు కొట్టే చాన్స్
మధ్య, తూర్పు పసిఫిక్‌లోని నినో 3.4 ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3.4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త జీక్ హాస్‌ఫాదర్ తెలిపారు. ఇదే జరిగితే 2015 నవంబర్–2016 జనవరి మధ్య నమోదైన 2.6 డిగ్రీల రికార్డు బద్దలవుతుంది. అంటే గత రికార్డు ఉష్ణోగ్రత కంటే 1.1 డిగ్రీలు ఎక్కువ. ఈ ఎల్‌నినో డిసెంబర్‌లో పీక్కు చేరే చాన్స్ ఉంది. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగొచ్చని డబ్ల్యూఎంవో అంచనా వేసింది. ఇదే జరిగితే ఇప్పటికే వేడెక్కిన భూగోళంపై దాని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది.
4.51 లక్షల మరణాల ముప్పు?
ఇది సహజంగా ఏర్పడే ఎల్‌నినో–సదరన్ ఆసిలేషన్ (ఈఎన్‌ఎస్‌ఓ) సైకిల్‌లోని వేడి దశ. సాధారణంగా రెండు నుంచి ఏడేళ్లకోసారి వచ్చే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతాలను ప్రభావితం చేస్తుంది. మానవ కార్యకలాపాలు, కాలుష్యం వల్ల చోటుచేసుకున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎల్‌నినో మరింత పెంచుతున్నదని డబ్ల్యూఎంవో పేర్కొంది. చికాగో యూనివర్సిటీకి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ అంచనా ప్రకారం.. ఈ సూపర్ ఎల్‌నినో వల్ల 2026 జూన్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు ప్రపంచవ్యాప్తంగా 4.51 లక్షల వరకు అదనపు మరణాలు సంభవించే ముప్పు ఉంది. అయితే ఇది ఎల్‌నినో ప్రభావ పరిస్థితులపై రీసెర్చ్ ఆధారంగా వేసిన అంచనా మాత్రమే.
సముద్రంలో దాగిన వేడి బయటికి
ఈసారి వేడి ముప్పు కేవలం సముద్ర ఉపరితలానికే పరిమితం కాదు. పసిఫిక్ సముద్రం లోతుల్లో సాధారణం కంటే 10 డిగ్రీలకుపైగా అధిక వేడి నిల్వ ఉన్నట్లు మెట్రోలాజికల్ మానిటరింగ్స్ సూచిస్తున్నాయి. సముద్రం లోతుల్లోని ఈ వేడి పైకి వస్తుండగా.. ఉపరితలంపై ఇప్పటికే ఉన్న వేడి కూడా వాతావరణంలోకి రిలీజ్ అవుతున్నది. ఈ రెండు ప్రభావాలు కలిసి ప్రపంచ టెంపరేచర్లను మరింత పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మెట్రోలాజికల్ ఎక్స్‌పర్ట్ లియోన్ సిమన్స్ దీనిని ‘సూపర్ డూపర్ ఎల్‌నినో’గా అభివర్ణించారు. వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మావ్ కూడా వరల్డ్ టెంపరేచర్ మ్యాప్‌ను సోషల్‌మీడియాలో షేర్చేస్తూ.. అమెరికా మినహా భూగోళంలోని అత్యధిక ప్రాంతాలు ఎరుపు రంగులో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
చలికాలంలోనూ వేడి ప్రభావం
ఉత్తరార్ధగోళంలో చలికాలం మొదలైనా ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ తగ్గే అవకాశం కనిపించడం లేదు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ టెంపరేచర్ నమోదయ్యే చాన్స్ ఉందని డబ్ల్యూఎంవో తెలిపింది. ఇప్పటికే 2026 ఆగస్టులో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఎల్‌నినో మరింత బలపడటం ఆందోళన కలిగిస్తోంది. దీని ప్రభావంతో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, వరదలు సంభవించొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ఉపఖండంలో అక్టోబర్–డిసెంబర్ మధ్య సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా.
