మొహాలీ: పోయిన మ్యాచ్‌లో 136 రన్స్ టార్గెట్‌ను కూడా ఛేజ్ చేయలేక ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ మొహాలీలో ఫోర్లు, సిక్సర్ల మోత మోగించింది. బ్యాటర్లు పూనకం వచ్చినట్టు చెలరేగడంతో ఐపీఎల్‌లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరుతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ (40 బాల్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 72), కైల్ మేయర్స్ (24 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 54) వీర విధ్వంసంతో 257/5 స్కోరుతో చెలరేగింది. తామేం తక్కువా అన్నట్టు పంజాబ్ సైతం దోసౌ కొట్టింది. మొత్తానికి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 458 రన్స్ వచ్చిన పోరులో లక్నో 56 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. తొలుత స్టోయినిస్, మేయర్స్ తోడు, నికోలస్ పూరన్ (19 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45), ఆయుష్ బదోనీ (24 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43) దంచడంతో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లకు 257/5 చేసింది. ఛేజింగ్‌లో పంజాబ్ 19.5 ఓవర్లలో 201స్కోరుకు ఆలౌటైంది. ఓపెనర్ అథర్వ తైడే (36 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66) పోరాడినా ఫలితం లేకపోయింది. స్టోయినిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
బాదుడే బాదుడు..
గాయం నుంచి కోలుకొని మూడు మ్యాచ్‌ల తర్వాత బరిలోకి దిగిన పంజాబ్ కెప్టెన్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం సరికాదని తేలేందుకు ఎంతో సమయం పట్టలేదు. తొలి బంతికి ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (12) బ్యాటింగ్ పిచ్‌పై ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. కానీ, అప్పటికే మేయర్స్ మోత మొదలైంది. అర్ష్ దీప్ వేసిన రెండో ఓవర్లో నాలుగు ఫోర్లు బాదిన అతను గుర్నూర్ బౌలింగ్‌లో 6,4 కొట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన యంగ్‌స్టర్ బదోనీ కూడా అలవోకగా బాల్‌ను బౌండ్రీ దాటించాడు. రజా వేసిన ఐదో ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన మేయర్స్... రబాడ బౌలింగ్‌లో 6, 4 తో 20 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకొని ఔటయ్యాడు. దాంతో, పవర్ ప్లేలోనే లక్నో 74/2 స్కోరు చేయగా.. గుర్నూర్ బౌలింగ్‌లో బదోనీ, స్టోయినిస్ చెరో సిక్స్, ఫోర్‌తో రెచ్చిపోవడంతో 8 ఓవర్లకే స్కోరు వంద దాటింది. ఈ ఇద్దరిని అడ్డుకునేందుకు ధవన్ బౌలర్లను మార్చినా... ఏడుగురితో బౌలింగ్ చేయించినా ఫలితం లేకపోయింది. 38 రన్స్ వద్ద స్టోయినిస్‌కు లైఫ్ దక్కింది. రాహుల్ చహర్ వేసిన 13వ ఓవర్లో అతనిచ్చిన క్యాచ్‌ను లాంగాఫ్‌లో అందుకున్న లివింగ్‌స్టోన్ బౌండ్రీ రోప్‌పై అడుగు పెట్టడంతో అది సిక్స్‌గా మారింది. దీనికి పంజాబ్ భారీ మూల్యమే చెల్లించుకుంది. లివింగ్‌స్టోన్ వేసిన తర్వాతి ఓవర్లో సిక్స్ కొట్టిన వెంటనే బదోనీ ఔటైనా.. హ్యాట్రిక్ ఫోర్లతో ఖాతా తెరిచిన నికోలస్ పూరన్ కూడా బౌండ్రీలనే టార్గెట్ చేశాడు. దాంతో, 16 ఓవర్లకే స్కోరు 200 దాటింది. రబాడ వేసిన 18వ ఓవర్లో పూరన్, స్టోయినిస్ చెరో సిక్స్ సహా 19 రన్స్ రాబట్టారు. వాళ్ల జోరు చూస్తుంటే లక్నో ఐపీఎల్‌లో హయ్యెస్ట్ స్కోరు రికార్డు బ్రేక్ చేసేలా కనిపించింది. 19వ ఓవర్లో స్టోయినిస్‌ను ఔట్ చేసిన కరన్ పది రన్స్ ఇవ్వగా.. పూరన్‌ను పెవిలియన్ చేర్చిన అర్ష్‌దీప్ 12 రన్స్ ఇవ్వడంతో సెకండ్ హయ్యెస్ట్ స్కోరుతో లక్నో ఇన్నింగ్స్ ముగించింది. లక్నో బ్యాటర్ల దెబ్బకు అర్ష్‌దీప్ 54 రన్స్, రబాడ 52 రన్స్ ఇచ్చుకున్నారు.
పంజాబ్ పోరాడినా..
ఛేజింగ్‌లో పంజాబ్ కూడా గొప్పగా పోరాడినా టార్గెట్ అతి భారీగా ఉండటంతో ఓటమి తప్పలేదు. బ్యాట్‌తో దంచిన స్టోయినిస్ బౌలింగ్‌లో రాణించాడు. ఇన్నింగ్స్ ఐదో బాల్‌కే ధవన్ (1)ను ఔట్ చేసి పంజాబ్‌కు షాకిచ్చాడు. నాలుగో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ (9)ను నవీన్ ఉల్ హక్ పెవిలియన్ చేర్చడంతో 31/2తో కింగ్స్ డీలా పడింది. కానీ, యంగ్ ఓపెనర్ అథర్వ తైడే, సికందర్ రజా (36) ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ వరుస పెట్టి బౌండ్రీలు కొట్టడంతో 11 ఓవర్లకు 106/2తో కింగ్స్పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ, వరుసగా ఓవర్లలో రజాను యశ్ఠాకూర్, తైడేను బిష్ణోయ్ పెవిలియన్ చేర్చి బ్రేకులు వేశారు. హిట్టర్ లివింగ్‌స్టోన్ (23)
ఉన్నంతసేపు ధాటిగా ఆడటంతో 15 ఓవర్లకు పంజాబ్ 152/4తో నిలిచింది. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ 20 దాటింది. బిష్ణోయ్ వేసిన తర్వాతి ఓవర్లో లివింగ్‌స్టోన్ ఎల్బీ అవ్వడంతో కింగ్స్ఓటమి ఖాయమైంది. చివర్లో కరన్ (21), జితేశ్ (24)పోరాటంతో స్కోరు 200 దాటింది.యశ్ ఠాకూర్ నాలుగు, నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు పడగొట్టారు.
- 67 రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి వచ్చిన బౌండ్రీలు (45 ఫోర్లు, 22 సిక్సర్లు). ఐపీఎల్ మ్యాచ్‌లో రెండో అత్యధికం. 69 బౌండ్రీలతో సీఎస్కే, రాజస్తాన్ (2010) మ్యాచ్ ముందుంది.
- 458 ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి నమోదైన పరుగులు. ఐపీఎల్‌లో మూడో అత్యధికం. 2010లో చెన్నై, రాజస్తాన్ మ్యాచ్‌లో 469 రన్స్ రాగా, 2018లో పంజాబ్, కేకేఆర్ మ్యాచ్‌లో 459 పరుగులు వచ్చాయి.