సూపర్‌‌‌‌‌‌‌‌ సేవియర్స్‌‌‌‌

సూపర్‌‌‌‌‌‌‌‌ సేవియర్స్‌‌‌‌

అనుకోకుండా ఆపద తరుముకొస్తుంది. ఉన్నట్టుండి చెప్పలేనంత కష్టం చుట్టుముడుతుంది. ఏం చేయాలో తోచదు. ఎలా బయటపడాలో అర్థం కాదు. అప్పుడే అనిపిస్తుంది.. ఎవరైనా వచ్చి కాపాడితే ఎంత బాగుణ్ను అని. రియల్‌‌‌‌ లైఫ్‌‌‌‌లో అలా ఎవరైనా వస్తారో లేదో తెలీదు. కానీ రీల్‌‌‌‌ లైఫ్‌‌‌‌లో మాత్రం హీరో కచ్చితంగా వస్తాడు. నేనున్నానంటూ అభయమిస్తాడు. తన ప్రాణాలకు తెగించి మరీ ఆదుకుంటాడు. ఆ సాహసాలు చూడటానికే ప్రేక్షకులు థియేటర్‌‌‌‌‌‌‌‌ దగ్గర క్యూ కట్టేది! వారిని అలరించడానికే మన దర్శకులు సూపర్‌‌‌‌‌‌‌‌ సేవియర్స్‌‌‌‌ని తయారు చేసేది!

ఇప్పుడంటే హీరోలు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నారు కానీ.. సినిమా అనేది పుట్టినప్పటి నుంచి మనకి హీరో అంటే మంచోడే. అందరికీ మంచి చేసేవాడే. ఎప్పుడైనా కాస్త నెగిటివ్‌‌‌‌గా ఉంటే హీరోని యాక్సెప్ట్ చేస్తారేమో కానీ.. హీరోకి ఉండాల్సిన లక్షణాల చిట్టా మన ప్రేక్షకుల దగ్గర ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌గా ఉంటుంది. అందగాడు అయ్యుండాలి. తెలివితేటలూ ఉండాలి. ఎవరికైనా కష్టం వచ్చిందంటే క్షణాల్లో ప్రత్యక్షమైపోవాలి. ఎంత పెద్ద విలన్‌‌‌‌ని అయినా మట్టి కరిపించాలి. అదే హీరో నుంచి ఆడియెన్స్ కోరుకునేది. అందుకే ఎన్ని ప్రయోగాలు చేసినా హీరోని సేవియర్‌‌‌‌‌‌‌‌గా చూపించడానికే ఎక్కువ ట్రై చేస్తుంటారు ఫిల్మ్ మేకర్స్.

దేశ రక్షకులు
సైనికులు, పోలీసులు తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా దేశాన్ని, ప్రజల్ని కాపాడుతుంటారు. వారి సాహసాలు, త్యాగాలు అందరికీ తెలియజేసేందుకు ఆయా పాత్రలతో సినిమాలు తీస్తుంటారు దర్శకులు. ఇవి యాక్షన్ ఓరియెంటెడ్‌‌‌‌గా ఉండటంతో ప్రేక్షకులు కూడా చాలా ఇష్టపడతారు. ఆ పాత్రలో తమ ఫేవరేట్ హీరోల్ని చూసుకుని మురిసిపోతుంటారు. రీసెంట్‌‌‌‌గా ‘వైల్డ్‌‌‌‌ డాగ్‌‌‌‌’లో నాగార్జున దేశాన్ని కాపాడటానికి ఎన్ని రిస్కులు చేశారో చూశాం. త్వరలో రానున్న ‘ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌’లో ‘అల్లూరి’ రామ్‌‌‌‌చరణ్‌‌‌‌తో కలిసి ‘గోండు బెబ్బులి’ ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ కూడా దేశం కోసం ఏకంగా బ్రిటిష్ వారితోనే పోరాడబోతున్నాడు. ‘ఏజెంట్‌‌‌‌’లో అఖిల్‌‌‌‌ డ్యూటీ కూడా దేశాన్ని కాపాడటమే. ఇక లాయర్లు కూడా దేశ ప్రజల్ని కాపాడేందుకు కష్టపడుతుంటారు. చట్టం సాయంతో దుర్మార్గుల బారి నుంచి వారిని విడిపిస్తారు. మొన్నటికి మొన్న ‘వకీల్‌‌‌‌సాబ్‌‌‌‌’గా పవన్‌‌‌‌ చేసింది అదే. రీసెంట్‌‌‌‌గా ‘జై భీమ్‌‌‌‌’ అంటూ సూర్య చేసింది కూడా అదే. త్వరలో మరింత మంది హీరోలు, హీరోయిన్లు పోలీసులు, లాయర్లు, సోల్జర్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్స్‌‌‌‌లో కనిపించబోతున్నారు.

తనవాళ్ల కోసం..
దేశాన్ని కాపాడటానికి చాలామంది ఉన్నారు. మరి ఇంటిలోనే ముసలం పుడితే ఎవరు ఆదుకుంటారు? అందుకు ప్రతి కుటుంబంలో ఒకడుంటాడు. తాను ఏమైపోయినా పర్లేదు, తనవాళ్లు మాత్రం సంతోషంగా ఉండాలనుకుంటాడు. అందుకు ఏం చేయడానికైనా రెడీ అయిపోతాడు. దృశ్యం, దృశ్యం 2 చిత్రాల్లో తన ఫ్యామిలీని కాపాడుకోడానికి వెంకటేష్ పడిన శ్రమ మనసుల్ని కదిలించింది. అల్లకల్లోలంగా ఉన్న కుటుంబాన్ని గాడిలో పెట్టడానికి, శత్రువు బారి నుంచి తండ్రి గౌరవాన్ని కాపాడటానికి ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ చేసిన హంగామా అందరికీ నచ్చింది. కన్నకూతురి కోసం అజిత్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా మారాడు ‘విశ్వాసం’లో. తండ్రికిచ్చిన మాట కోసం ప్రపంచం మొత్తాన్నీ శాసించాడు మోహన్‌‌‌‌లాల్ ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌’లో. రీసెంట్‌‌‌‌గా వచ్చిన ‘టక్ జగదీష్‌‌‌‌’ ఆరాటం.. ‘పెద్దన్న’ పోరాటం తన సొంతవాళ్ల  కోసమే.  

ఆపద్బాంధవులు
కష్టమొస్తే తనంతట తానుగా వచ్చి ఆదుకునే ఆపద్బాంధవులకు సినిమాల్లో కొదవే లేదు. వీళ్లందరూ తమ కోసం కాకుండా ఇతరుల కోసం ఆరాటపడుతుంటారు. ఎవరికో ఏదో చేయాలని ఎంతో పోరాటం చేస్తుంటారు. విచిత్రం ఏమిటంటే.. ఎప్పుడూ సమస్య వీళ్లని వెతుక్కుంటూ రాదు. వీళ్లే సమస్యల్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఓ చిన్న కారణంతో ఒక ఊరికి వెళ్లిన ‘శ్రీమంతుడు’ అక్కడి వాళ్లందరినీ కాపాడటం కోసం ఊరి బాధ్యతను మీద వేసుకున్నాడు. స్నేహితుడికి సాయం చేద్దామని పల్లెటూరికి పోయిన ‘మహర్షి’ సీఈవో పోస్టును వదులుకుని రైతుగా మారిపోయాడు. డిమోషన్‌‌‌‌ పేరుతో జైల్లో డ్యూటీకి పోయిన మాస్టర్.. బాల నేరస్థుల జీవితాలనే మార్చేశాడు. ఏదో చిన్న పని మీద రాజస్థాన్‌‌‌‌ వెళ్లి ‘ఖలేజా’ చూపించినందుకు ఒక కుర్రాడు ఒక ఊరివాళ్లకి దేవుడైపోయాడు. తన స్వార్థంతో ‘కేజీయఫ్‌‌‌‌’కి వెళ్లిన యువకుడు కొన్ని వందల మందిని కాపాడి వీరుడిగా నిలిచాడు. తాను పని చేసే ప్రాంతంలోని ప్రజలకు మేలు చేయాలని ‘రిపబ్లిక్‌‌‌‌’లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ చేసిన ఫైట్‌‌‌‌ చూసి మెచ్చుకున్నాం. తన జీవితంలా మరే ఆడపిల్ల జీవితమూ కాకూడదని సెక్స్‌‌‌‌ వర్కర్ల పిల్లల హక్కుల కోసం ‘గంగూబాయ్ కథియావాడి’ పడిన తపన చూసి శభాష్ అన్నాం. చెడును అంతం చేసి మంచిని స్థాపించడానికి జరిగిన ‘అఖండ’ పోరాటాన్ని చూసి సంతోషించాం. త్వరలో ‘సాలార్‌‌‌‌‌‌‌‌’ కూడా వీరి బాటలోనే నడవబోతున్నాడు. బొగ్గు గనుల కార్మికుల కష్టాలు తీర్చే పనిలో పడనున్నాడు. రవితేజ కూడా ‘రామారావ్ ఆన్‌ డ్యూటీ’ అంటూ డిప్యూటీ కలెక్టర్​గా ఓ జిల్లాని సేవ్ చేయబోతున్నాడు. వీళ్లందరి బాట ఒక్కటే. తాము ఉన్న చోట ఎవ్వరికీ అన్యాయం జరగకూడదు. తమ చుట్టూ ఉన్నవారికి సాయపడేంత వరకు నిద్రపోకూడదు.

ఈమధ్య సైకో కిల్లర్‌‌‌‌‌‌‌‌ సినిమాలు ఎక్కువయ్యాయి. ఓ పరమ దుర్మార్గుడు ఉంటాడు. రాక్షసంగా ప్రవర్తిస్తుంటాడు. వాడి ఆట కట్టించే పని ఆ సినిమాలో హీరోనో హీరోయినో తలకెత్తుకుంటారు. కనిపించకుండా పోయిన తన చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్లిన ‘అశ్వథ్థామ’.. అందుకు కారణమైన సైకోగాడిని రఫ్పాడించాడు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసోడు వికృతంగా మారి అందరి ప్రాణాలూ తీస్తుంటే.. అతని ఆట కట్టించడానికి ‘అంజలి సీబీఐ’ని రంగంలోకి దింపారు. ఇక ఆడపిల్లల్ని వేధించేవాళ్లకి అంతే లేదు. మ్యాగ్జిమమ్ సైకోలంతా అమ్మాయిల వెనకాలే ఎందుకు పడతారో అర్థం కాదు. మర్దానీ, రాక్షసుడు, సైకో, ఈటీ లాంటి చిత్రాలన్నీ ఆడపిల్లల చుట్టూనే తిరుగుతాయి. ఎవడో ఒకడి వల్ల అమ్మాయిల జీవితాలు నాశనమవుతుంటే వారిని కాపాడాల్సిన బాధ్యత లీడ్ యాక్టర్‌‌‌‌‌‌‌‌పై పడుతుంది. ఆ తర్వాత వాడి అంతం. ప్రేక్షకులకి ఆనందం.

వీళ్ల కథ వేరే!
మరికొంతమంది ఉంటారు. వీళ్లకి చాలా ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి. అవి కాస్త డిఫరెంట్‌‌‌‌గా కూడా ఉంటాయి. ఈ భూమిని చుట్టుముట్టే చిత్ర విచిత్రమైన సమస్యల నుంచి ప్రజల్ని కాపాడటానికి అప్పట్లో ‘క్రిష్‌‌‌‌’ అనే సూపర్‌‌‌‌‌‌‌‌ హీరో పుట్టుకొచ్చాడు. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ను ప్రయోగించి ఈ లోకాన్ని కాపాడతానంటూ మరో హీరో రానున్నాడు. మానవ సంబంధాలను కాపాడి ‘ఎంత మంచివాడివిరా’ అని ఒక కుర్రాడు అనిపించుకుంటే.. ఆడపిల్లలను వ్యభిచారంలో దించే ముఠా ఆట కట్టించి ఓ ‘డాక్టర్‌‌‌‌‌‌‌‌’ కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. అటవీ సంపదకు రక్షగా ‘అరణ్య’ నిలబడితే.. తనదీ అదే లక్ష్యమంటూ ‘షేర్నీ’ నడుం కట్టింది. తమ ఊరి ఆలయ సంపదను కాపాడటానికి ‘బంగార్రాజు’ స్వర్గం నుంచి నేలకు దిగాడు. మొత్తం ఆలయాలన్నింటి సంపదనూ రక్షించడానికి ‘ఆచార్య’ వస్తున్నాడు. వీళ్ల కథలు వేరే. కానీ వీళ్లందరి దారి మాత్రం ఒక్కటే. తమ అవసరం ఉన్నచోట రక్షకులుగా ప్రత్యక్షమవడమే. చూశారు కదా. సినిమాల్లో పాత్రలకి కష్టాలు కామన్. వారిని కాపాడటానికి ఒకరు రావడం అంతకంటే కామన్. ఈ ఆర్డినరీ విషయాన్ని ఎంత ఎక్స్‌‌‌‌ట్రార్డినరీగా చూపిస్తే అంత పెద్ద విజయం దక్కుతుంది. అందుకే సేవింగ్‌‌‌‌లో సేవియర్స్‌‌‌‌ కొత్త టెక్నిక్స్ వాడుతుంటారు. వెండితెరపై జనాన్ని కాపాడటంతో పాటు బాక్సాఫీసు దగ్గర సినిమాని కూడా సేవ్ చేస్తుంటారు.