సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. భారీ బడ్జెట్ తో రూపుదిద్దకుంటున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ గురించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా కేవలం భారతీయ సినిమాగానే కాకుండా, హాలీవుడ్ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అంటార్కిటికాలోని రోస్ ఐస్ షెల్ఫ్‌లో కీలక షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
రాజమౌళి గ్లోబల్ ప్లాన్..
ఇక ఇటీవల మెక్సికోలో నిర్వహించిన ప్రముఖ కామిక్ కాన్ ఈవెంట్ లో వారణాసికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ ను ప్రదర్శించారు. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. ఇదే ఉత్సాహంతో ఉన్న రాజమౌళి టీమ్.. ఇప్పుడు బ్రెజిల్ లో భారీ ప్రమోషన్స్ కు రెడీ అయ్యారు. లాటిన్ అమెరికా మార్కెట్ లో సినిమాపై హైప్ ను మరింత పెంచేందుకు ఈ గ్లోబల్ ప్రమోషన్ కు శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ఈవెంట్లలో ప్రమోషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ల దృష్టిని ఆకర్షించాలన్న లక్ష్యంతో దర్శకధీరుడు ముందుకు సాగుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
విరామం లేని లైనప్
రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి సమయం పడుతుందనేది అందరికీ తెలిసిందే. అయితే, ఈసారి మహేష్ ఏమాత్రం విరామం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. రాజమౌళి ప్రాజెక్ట్ ముగియకముందే తన తదుపరి సినిమాలపై ఆయన దృష్టి సారించారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీనికోసం ఇప్పటికే అడ్వాన్స్ కూడా చేతులు మారిందని టాక్.
క్రేజీ కాంబినేషన్లు
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అసలైన కిక్ ఇచ్చే వార్త ఏమిటంటే.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్లతో ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. 'యానిమల్' తర్వాత ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ వంగా, మహేష్ బాబు కోసం ఒక వైవిధ్యమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఇక '1: నేనొక్కడినే' తర్వాత సుకుమార్ తో కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.
వీటితో పాటు, తన స్వంత బ్యానర్ జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ కింద ఒక విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాను కూడా మహేష్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, 'వారణాసి'తో గ్లోబల్ ఐకాన్‌గా మారబోతున్న మహేష్ బాబు, ఆ తర్వాత రాబోయే సినిమాలతో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది .

