ట్రెండ్ సెట్టర్.. సూపర్ స్టార్ కృష్ణ 52 ఏళ్ల సినీ ప్రస్థానం

ట్రెండ్ సెట్టర్.. సూపర్ స్టార్ కృష్ణ 52 ఏళ్ల సినీ ప్రస్థానం
  • 1965లో తొలిచిత్రం తేనె మనసులు విడుదల 
  • తెలుగులో తొలి జేమ్స్ బాండ్, కౌబాయ్ హీరో కృష్ణ 
  • హీరోగా 350 పైగా సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ
  • సింహాసనం సినిమాతో మెగాఫోన్ 
  • తెలుగు సినిమాలకు సాంకేతిక హంగులద్దిన కృష్ణ
  • అల్లూరి సీతారామరాజుతో నటుడిగా ఎనలేని ఖ్యాతి
  • హీరోగా,నిర్మాతగా,దర్శకుడిగా,ఎడిటర్‌గా టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు 
  • పద్మాలయ స్టూడియో పతాకంపై ఉత్తమ చిత్రాల నిర్మాణం
  • విజయనిర్మలతో దాదాపు 48 వరకు చిత్రాల్లో స్క్రీన్ షేర్ 
  • 1989లో ఏలూరు ఎంపీగా గెలుపు

సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినీ చరిత్రలో ఆయనో ట్రెండ్ సెట్టర్. సంచలన సినిమాలు చేయాలన్నా..సాహస సినిమాలు తీయాలన్నా..సూపర్ స్టార్ తర్వాతే ఎవరైనా. నటుడిగా మొదలైన సినీ జీవితంలో... దర్శకుడిగా మారి ఎన్నో సినిమాలు తీశారు. నిర్మాతగా మారి ఎన్నో చిత్రాలను నిర్మించారు. స్టూడియా నిర్మించి..ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు.  భారతీయ సినిమా రంగంలో సూపర్ స్టార్ కృష్ణ ఒక లెజెండ్. సూపర్ కృష్ణ 79వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విశేషాలు. 

అలా మొదలైంది..

సూపర్ స్టార్ కృష్ణ 1943,మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1960లో ఏలూరు CR రెడ్డి. కాలేజీలో బిఎస్సీ చదివారు. ఆయన తొలిసారిగా పాతాళభైరవి సినిమా చూశారు. దేవదాసు వంద రోజుల పండగకు  ఏఎన్నార్‌,సావిత్రిలు తెనాలి వచ్చారు. అయితే వారిని చూసేందుకు వేల సంఖ్యలో జనం రావడంతో..ఆశ్చర్యపోయారు.  అలాంటి గౌరవాన్ని తానూ సంపాదించాలనే కోరికతో సినిమా రంగంవైపు అడుగులు వేశారు. మొదట నాటకాలు, వేషాలు వేశారు. 1960లో చేసిన పాపం కాశీకెళ్ళినా అనే నాటకంలో కృష్ణ నటించారు. ఇందులో శోభన్‌బాబు కూడా నటించడం విశేషం. ఆ తర్వాత భక్త శబరి,సీతారామ కళ్యాణం, ఛైర్మన్‌ వంటి నాటకాల్లో నటించి మెప్పించారు. 

52 ఏళ్ల సినీ ప్రస్థానం..

నాటకాల్లో రాణించడంతో..మద్రాసు చేరి సినిమా చాన్సుల కోసం ప్రయత్నించారు కృష్ణ. కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. కానీ 1964లో ‘తేనె మనసులు’ చిత్రంలో హీరోగా నటించే చాన్స్ వచ్చింది. ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో బసవరాజు అనే పాత్రతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు కృష్ణ. ఆ తర్వాత మరో సినిమా చేసినా.. హీరోగా నటించిన మూడో చిత్రం ‘గూఢచారి 116’ ఆయనకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.

 

ఇక డెబ్భై, ఎనభైల కాలంలో ఆయనదే హవా. యేటా పది సినిమాలు చేసేవారు. ఒక సంవత్సరమైతే పద్దెనిమిది సినిమాల్లో నటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన కెరీర్‌‌లో మూడొందల నలభైకి పైగా సినిమాలు చేశారంటే ఆయనకి ఏ స్థాయిలో డిమాండ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1968 నుంచి 74 వరకు ఏడాది ఆయన పదికిపైగా చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్కోసారి పట్టణాల్లోని అన్ని థియేటర్లలో అన్నీ కృష్ణ సినిమాలే ఆడేవి. ఆ రోజుల్లో కృష్ణ..రోజుకి మూడు షిప్ట్‌ల్లో పనిచేసేవారట. 52 ఏండ్ల సినీ కెరీర్‌లో సూపర్ కృష్ణ 350కిపైగా చిత్రాల్లో నటించారు. గూఢచారి 116, సాక్షి, మోసగాళ్లకు మోసగాడు,పండంటికాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు,కురుక్షేత్రం, భలే దొంగలు,మనస్సాక్షి,ఈనాడు,సింహాసనం,ముద్దు బిడ్డ, నంబర్‌ 1' వంటి చిత్రాలు కృష్ణలోని నటనకు ప్రతిబింబాలు. ఈ చిత్రాలు ఆయనకు గొప్ప పేరును సంపాదించిపెట్టాయి. సాక్షి సినిమా అయితే.. అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. 

కుటుంబ నేపథ్యం..విజయనిర్మలతో రెండో పెళ్లి..

కృష్ణ  1962లో ఇందిరాదేవిని పెళ్ళి చేసుకున్నారు. ఇందిరాదేవి కృష్ణ మేనమామ కూతురు. వీరికి ఇద్దరు కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు, ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. గూడాచారి చిత్రం బంఫ‌ర్ హిట్ అయిన తర్వాత... కృష్ణకు ఆఫర్లు వెళ్లువెత్తాయి. ఆయ‌న‌తో ఎక్కువ‌గా విజ‌య నిర్మ‌ల హీరోయిన్‌గా చేశారు.ఈ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఎవ‌రికీ చెప్ప‌కుండా ఓ ఆలయంలో విజ‌య నిర్మ‌ల‌ను కృష్ణ పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత త‌న భార్య ఇందిరాదేవితో పాటు కుటంబ స‌భ్యులంద‌రికీ విషయం చెప్పారు. కృష్ణ‌కు మొద‌టిపెళ్లి జ‌రిగిన నాలుగేళ్ల‌కు ..విజ‌య నిర్మ‌ల‌ను పెళ్లి చేసుకున్నారు. విజయనిర్మలను పెళ్లి చేసుకున్నా..త‌న‌తోనే ఉంటాన‌ని ఇందిరాదేవి చెప్పారు. 

 

సూపర్ స్టార్ బిరుదు..

సూపర్ స్టార్ బిరుదు కంటే కృష్ణను నటశేఖర, డేరింగ్ అండ్ డ్యాషింగ్ అని పిలుచుకునేవారు. అయితే సినీ వారపత్రిక శివరంజని ఓ సందర్భంలో తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఇస్తారని ఓటింగ్ నిర్వహించింది. అందులో కృష్ణ తిరుగులేని ఓటింగ్ సంపాదించారు. దీంతో ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ అయిపోయారు.

సూపర్ కృష్ణ ట్రెండ్ సెట్టర్..

తెలుగు సినీ పరిశ్రమకి చాలా కొత్త విషయాలను, టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కృష్ణదే. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా (గూఢచారి 116) ఆయనే చేశారు. మొదటి కౌబాయ్ మూవీ (మోసగాళ్లకు మోసగాడు) చేసిందీ ఆయనే. తొలి ఫుల్‌ స్కోప్‌ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’తో సెన్సేషన్‌ క్రియేట్ చేశారు. తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’తో వాహ్వా అనిపించుకున్నారు. స్టీరియోఫోనిక్ సిక్స్ ట్రాక్ సౌండ్ టెక్నాలజీని వాడిన మొదలటి సినిమా కూడా ఇదే. ‘కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్‌‌ఓ సాంకేతికతను పరిచయం చేశారు. ‘గూడుపుఠాణి’తో ఓఆర్‌‌డబ్ల్యూ కలర్‌‌ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం ‘భలేదొంగలు’ కూడా కృష్ణదే. ఇక బాక్సాఫీస్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మద్రాస్‌లో వంద రోజులు కంప్లీట్ చేసుకున్న తొలి తెలుగు సినిమా కృష్ణ నటించిన ‘చీకటి వెలుగులు’ అని రికార్డులు చెబుతున్నాయి. ‘అల్లూరి సీతారామరాజు’ అయితే హైదరాబాద్‌లో సంవత్సరం పాటు ఆడి రికార్డును నెలకొల్పింది.  పండంటి కాపురం, దేవుడు చేసిన మనుఫులు, ఊరికి మొనగాడు, ఈనాడు, అగ్నిపర్వతం.. ఇలా చాలా సినిమాలు తిరుగులేని విజయాల్ని అందించాయి. ముప్ఫై సంక్రాంతులకు ఆయన సినిమాలు విడుదలైతే.. 1976 నుంచి ఇరవయ్యొక్కేళ్ల పాటు కంటిన్యుయస్‌గా ప్రతి సంక్రాంతికీ ఆయన సినిమా విడుదలవడం మరో రికార్డ్.

దర్శక నిర్మాత..

నటుడిగా వెలిగిపోతున్నప్పుడే డైరెక్టర్‌‌గానూ, నిర్మాతగానూ మారారు కృష్ణ. తన తమ్ముళ్లతో కలిసి పద్మాలయ పిక్చర్స్ సంస్థను నెలకొల్పారు. మొదటి ప్రయత్నంగా ‘అగ్నిపరీక్ష’ అనే చిత్రాన్ని తీశారు. ఆ సినిమా ఫెయిలైనా నిరాశపడకుండా ‘మోసగాళ్లకు మోసగాడు’ తీసి సూపర్‌‌ హిట్ కొట్టారు. ఇక దర్శకుడిగా శంఖారావం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నాతమ్ముడు, సింహాసనం లాంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాకి ఇంత పెట్టారు.. ఈ సినిమాకి ఇంత ఖర్చు పెడుతున్నారు అని లెక్కలు వేస్తున్నాం. అయితే తెలుగులో భారీ బడ్జెట్‌ సినిమాలు కృష్ణతోనే మొదలయ్యాయి. ఆ కోవలో ఫస్ట్ సినిమాగా ‘సింహాసనం’ పేరు చెబుతారు. కోట్లలో ఖర్చు పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో కృష్ణే స్వయంగా దీన్ని నిర్మించారు. ఆయనే డైరెక్ట్ చేశారు. ఇది అంచనాలను మించి విజయం సాధించడంతో ‘సింహాసన్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. జితేంద్ర హీరోగా నటించాడు. అంతేకాదు.. ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటున్న పాన్ ఇండియా సినిమాని అప్పట్లోనే చేశారు కృష్ణ. కొన్ని ఇంగ్లిష్ సినిమాల స్ఫూర్తితో ‘మోసగాళ్లకు మోసగాడు’ తీశారు. ఇది తమిళంతో పాటు హిందీలో ‘ఖజానా’ పేరుతో, ఇంగ్లిష్‌లో ‘ది ట్రెజర్‌‌’ పేరుతో విడుదలై సూపర్‌‌ హిట్ కొట్టింది. ఇంగ్లిష్ వెర్షన్ చాలా దేశాల్లో విడుదలైంది కూడా. దీన్ని బట్టి ఇప్పటి ఈ ట్రెండ్‌కి అప్పట్లోనే నాంది పలికి టార్చ్ బేరర్ గా నిలిచారు కృష్ణ. మొత్తంగా 12కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణ..వివిధ భాషల్లో దాదాపు 50 చిత్రాలను నిర్మించారు. 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి రికార్డు సృష్టించారు.తొమ్మిదేళ్ళలో 100 సినిమాల్లో నటించిన ఎవర్‌గ్రీన్‌ రికార్డూ కృష్ణకే సొంతం.తన సినీ జీవితంలో  వందకు పైగా దర్శకులతో పనిచేశారు. కృష్ణ దాదాపు 80మందికిపైగా హీరోయిన్లతో నటించారు. విజయనిర్మలతో 48 సినిమాలు, జయప్రదతో 47 చిత్రాలు, శ్రీదేవితో 31 చిత్రాలు,రాధతో 23 చిత్రాల్లో నటించారు.

డేరింగ్ అండ్ డ్యాషింగ్..

ముట్టుకుంటే మాసిపోయేలా సున్నితంగా కనిపిస్తారు కృష్ణ. అయితే ఒప్పుకున్న పాత్ర కోసం ఎంత రిస్క్ తీసుకోడానికైనా రెడీ అయిపోయేవారు. మొదటి సినిమా ‘తేనె మనసులు’లోనే స్కూటర్‌‌తో కారును చేజ్ చేసే సీన్ చేశారు. ఆయన స్కూటర్‌‌ని వదిలేసి కారు మీదికి జంప్ చేయడం చూసి ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు. ఇంత రిస్కీ షాట్‌ను డూప్ లేకుండా చేశారని తెలియడం వల్లే డూండీ ‘గూఢచారి 116’కి కృష్ణను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో అడ్వెంచర్స్ చేశారు కృష్ణ. ఆ క్రమంలో బైకులు, గుర్రాల మీద నుంచి పడిపోయిన సందర్భాలు బోలెడన్ని ఉన్నాయి. కత్తి గాట్లు పడిన సందర్భాలూ ఉన్నాయి. ‘సిరిపురం మొనగాడు’ సినిమా టైమ్‌లో ఆయన ప్రాణాల మీదికి కూడా వచ్చింది. అయినా కూడా ఆయన లెక్క చేసేవారు కాదు. ఎంత రిస్క్ అయినా తీసుకుని పాత్రకి ప్రాణం పోయాలని అనేవారు తప్ప తగ్గేవారు కాదు. అందుకే అప్పట్లో అందరూ ఆయన్ని డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో అనేవారు.


ఫ్రెండ్లీ హీరో..

సోలోగా ఎన్ని సినిమాలు చేసేవారో.. ఇతర హీరోలతో కలిసి అన్ని సినిమాలు చేసేవారు కృష్ణ. మల్టీస్టారర్ కు ఎప్పుడూ నో చెప్పేవారు కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌ బాబు దగ్గర్నుంచి రజినీకాంత్, మోహన్‌బాబు లాంటి వారి వరకు పలువురితో కలిసి నటించారు. ఆయన హీరో ఫ్రెండ్లీ మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ కూడా. నిర్మాతల హీరో అంటూ ఆయన్ని అందరూ పొగడటానికి కారణం ఆయన వ్యక్తిత్వమే. చెప్పిన టైముకి సినిమా పూర్తి చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇక తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోతే వెంటనే ఆదుకోడానికి రెడీ అయ్యేవారు. మరో మంచి సినిమా ప్లాన్ చేయమని, అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేవారు. ఇక ఎప్పుడైనా సినిమా రిలీజ్‌ అవ్వడానికి ఇబ్బందులు ఎదురైతే రెమ్యునరేషన్ కూడా తీసుకునేవారు కాదు. అందుకే కృష్ణ హీరోగా ఎదగడానికి, ఇన్ని సంచలనాలు సృష్టించడానికి ఆయన మంచితనం కూడా ఓ కారణమని ఇండస్ట్రీలో అందరూ చెబుతుంటారు. ఇక బయట కూడా ఎన్నో మంచి పనులు చేసేవారు. జై ఆంధ్ర ఉద్యమంలో మరణించిన అమర వీరులకు తన సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ను ఇచ్చేశారు. తుఫాను బాధితుల్ని సైతం ఎన్నోసార్లు ఆదుకున్నారు. 

ఎంపీగా సూపర్ స్టార్ కృష్ణ. 

1972లో జైఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చాడు.1982లో కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం "ఈనాడు" సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారానికి అనుకూలంగా ఉంది. ఎన్నికలు మూడువారాల్లో ఉన్న స్థితిలో విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్రభంజనంలో తనవంతు చిన్న పాత్ర పోషించింది.1983లో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల అయింది. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలు మొదలుకున్నాయి. ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాకా ఈ విభేదాలు రాజుకున్నాయి.1984 రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ, కృష్ణ కలిశారు.రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు 1984లో కృష్ణ కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత కృష్ణ ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశారు.టిడిపి ప్రభుత్వాన్నిదెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ నుంచి కృష్ణ నటించిన సినిమాల ద్వారా ప్రయత్నించారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది. ఆ ఎన్నికల్బోళ్ళ బుల్లిరామయ్ చేతిలో కృష్ణ ఓటమి పాలయ్రుడు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ కు కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది.

ఎన్టీఆర్, కృష్ణ మధ్య గొడవ నిజమేనా..

టాలీవుడ్ లో ఎన్టీఆర్, కృష్ణ మంచి స్నేహితులు. అయితే ఇద్దరి మధ్య ఓ టైటిల్ వల్ల వివాదం నెలకొందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కృష్ణ మొదటి కొడుకు రమేష్ బాబు హీరోగా సామ్రాట్ అనే టైటిల్ తో సినిమాని నిర్మించారు.ఇది  అతనికి ఫస్ట్ మూవీ. అటు బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సామ్రాట్ పేరుతోనే సినిమా చేశారు. అయితే రెండు సినిమాల పేర్లు ఒకటే అవ్వడంతో డైరెక్ట్ గా ఎన్టీఆర్, కృష్ణ ఈ విషయంపై చర్చించుకున్నారట. ఆ తర్వాత ఎన్టీఆర్ ఈ టైటిల్ ని కృష్ణకి ఇచ్చేశారని టాక్. బాలకృష్ణ నటించిన సినిమా పేరును సాహస సామ్రాట్ గా మార్చారు. ఈ చిత్రం యావరేజ్ గా నిలవగా... రమేష్ బాబు  సామ్రాట్ మాత్రం హిట్ అయ్యింది. సామ్రాట్ టైటిల్ ఇద్దరు అగ్ర నటుల మధ్య వివాదం రేపిందని అంటారు నాటి సినీ విశ్లేషకులు. 

అవార్డులు..రివార్డులు..

2008లో ఆంధ్రా యూనివర్సిటీ సూపర్ స్టార్ కృష్ణకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గానూ..కేంద్రం 2009లో పద్మభూషణ్‌ పురస్కారంతో కృష్ణను గౌరవించింది. 2003లో ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును అందుకున్నారు. ఫిల్మ్‌ ఫేర్‌ లైఫ్‌ ఎఛీవ్‌మెంట్‌ పురస్కారం లభించింది. 1972లో వచ్చిన పండంటి కాపురం చిత్రం ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపికై నేషనల్‌ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ "నటశేఖర" బిరుదును అందుకున్నారు.

సూపర్ స్టార్ కోరిక తీరేనా....

ఇన్నేళ్ల సినీ కెరీల్ లో పౌరాణికాలు, జానపదాలు,చరిత్ర నేపథ్యాలు, ప్రేమకథలు, ఫ్యామిలీ చిత్రాలు చేసినప్పటికీ...పూర్తి స్థాయిలో ఛత్రపతి శివాజీ పాత్ర పోషించాలన్నది కృష్ణ కోరిక. అయితే చంద్రహాస్, యాక్టర్ సినీ యాక్టర్,భారత సింహం వంటి సినిమాల్లో ఛత్రపతి పాత్రలో అలరించినా..పూర్తి స్థాయి పాత్ర పోషించలేదు. మరోవైపు తన కొడుకు మహేష్, మనవడు గౌతమ్ కలిసి ఒక భారీ చిత్రంలో నటించాలని ఉందని కృష్ణ చెప్పారు. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 

ఈ నటశేఖరుడి గొప్పదనం..సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ చిన్న పల్లెటూరి నుంచి వచ్చి ఇంత పెద్ద సినీ పరిశ్రమలో తన ముద్ర వేసిన ప్రతిభ ఆయనది. తెలుగు సినీ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఘనత ఆయనది. ఎన్నేళ్లు గడిచినా ఆయన స్థానం ఆయనదే. ఎన్నేళ్లు గడిచినా.. సూపర్‌‌ స్టార్‌‌ అంటే ఆయనే.