
రాంచీ: మీడియాపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ డిబేట్లు, సోషల్ మీడియాలోని ‘కంగారూ కోర్టులు’ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని విమర్శించారు. మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని.. పదాలను ఆచితూచి ఉపయోగించాలని సూచించారు. మీడియా, సోషల్ మీడియాలో జడ్జిలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని, ఈ విషయాలపై జడ్జిలు త్వరగా స్పందించకపోవచ్చని, అలాగని ఇది బలహీనత లేదా నిస్సహాయత అని అనుకోవద్దని అన్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో శనివారం జరిగిన జస్టిస్ సత్య బ్రతా సిన్హా స్మారక కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభోపన్యాసం ఇచ్చారు.
ప్రజాస్వామ్యానికి హాని
‘‘కేసులను నిర్ణయించడంలో మీడియా విచారణలు కోర్టులకు ‘గైడింగ్ ఫ్యాక్టర్’లా ఉండకూడదు. అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయం తీసుకోవడం కష్టమైన కొన్ని విషయాల్లో.. మీడియా కంగారూ కోర్టుల (సరైన ఆధారాలు లేకుండానే తీర్పులిచ్చే కొందరు వ్యక్తుల అనధికార కోర్టులు)ను నడపడం మనం చూస్తున్నాం” అని జస్టిస్ రమణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దారుణంగా సోషల్ మీడియా
ప్రింట్ మీడియా ఇప్పటికీ కొంత స్థాయి జవాబుదారీతనంతో పని చేస్తున్నదని.. ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం ‘జీరో అకౌంటబిలిటీ’తో ఉందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఇక సోషల్ మీడియా దారుణంగా ఉందన్నారు. సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను ఎడ్యుకేట్ చేసేందుకు, తమ పవర్‌ను ఉపయోగించాలని సూచించారు. మీడియా రెగ్యులేషన్స్‌ను కఠినతరం చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయని చెప్పారు.
సెక్యూరిటీ తీసేస్తారెందుకు?
జడ్జిలపై దాడులు పెరుగుతుండటంపై జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులకు ఇస్తున్నట్లుగా రిటైర్‌మెంట్ తర్వాత జడ్జిలకు సెక్యూరిటీ ఇవ్వటలేదని అన్నారు. ‘‘దశాబ్దాల పాటు పని చేసి, నేరస్తులను కటకటాల వెనక్కి నెట్టిన జడ్జి.. రిటైరైతే అంతకుముందు ఉన్న సెక్యూరిటీ మొత్తం తీసేస్తున్నారు. తాము శిక్షలు విధించిన నేరస్తులు ఉండే అదే సొసైటీలోనే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, భద్రతపై ఎలాంటి హామీ లేకుండా జీవించాలి’’ అని అన్నారు.