న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని దాఖలైన రిట్ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్లు పెంచాలని ఎన్విరాన్మెంట్ ఎక్స్ పర్ట్ కే పురుషోత్తంరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ బెంచ్ ముందుకు వచ్చింది.
తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు, ఏపీలో175 నుంచి 225 కు పెంచాలని విభజన చట్టంలో పొందుపరిచారని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 లో పేర్కొన్న నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులిచ్చింది.
