హత్యాచార కేసులో ఉరిశిక్ష రద్దు.. ఆ ముగ్గురూ నిర్దోషులే : సుప్రీంకోర్టు

హత్యాచార కేసులో ఉరిశిక్ష రద్దు.. ఆ ముగ్గురూ నిర్దోషులే : సుప్రీంకోర్టు

పదేళ్ల క్రితం ఢిల్లీలో 19 ఏళ్ల యువతిపై హత్యాచారం కేసులో మరణ శిక్ష పడిన ముగ్గురిని సుప్రీంకోర్టు ఇవాళ నిర్దోషులుగా ప్రకటించింది.  వివరాల్లోకి వెళితే.. 2012 ఫిబ్రవరిలో హర్యానాలోని రేవారీ జిల్లా రోధాయి గ్రామ శివారులోని ఓ  పొలంలో తీవ్ర గాయాలతో కూడిన బాధిత యువతి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై ఢిల్లీలోని చావాలా (నజఫ్ ఘర్) పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమెపై కారులోని పరికరాలు, మట్టి కుండలతో విచక్షణారహితంగా దాడిచేసి చంపినట్లు అప్పట్లో దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసును  2014 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఓ కోర్టు విచారించింది. ఆ బాలికను కిడ్నాప్  చేసి హత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలను ఎదుర్కొన్న  రవి కుమార్, రాహుల్, వినోద్ అనే ముగ్గురిని దోషులుగా గుర్తించింది. వారికి మరణ శిక్షను విధిస్తూ 2014  ఆగస్టు 26న తీర్పు ఇచ్చింది. అయితే ముగ్గురు  వ్యక్తులు ఈ తీర్పును అదే ఏడాది ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.  

ఢిల్లీ హైకోర్టు కూడా స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ.. ముగ్గురు దోషులను జనారణ్యంలో తిరుగుతున్న ప్రమాదకర జంతువులుగా అభివర్ణించింది.అనంతరం ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరకు ఈ ఏడాది (2022) ఏప్రిల్ లో ముగ్గురు దోషుల పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. మరణశిక్ష విధిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పును రద్దు చేసి, ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ముగ్గురికి ఎటువంటి నేర చరిత్ర లేదని.. కుటుంబ నేపథ్యం కూడా చాలా బాగుందని.. ఈ అంశాల దృష్ట్యా శిక్షను తగ్గించాలని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనల ఆధారంగానే సుప్రీంకోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించినట్లు తెలుస్తోంది.  అయితే ఈ తీర్పుపై బాధిత యువతి తల్లిదండ్రులు పెదవి విరిచారు. తమ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ‘‘మేం ఇక్కడికి న్యాయం కోసం వచ్చాం. ఇది చాలా గుడ్డి తీర్పు’’ అని వ్యాఖ్యానించారు.