న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారంలో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయన్న ప్రభుత్వ వాదనను సుప్రీం కోర్డు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసు విచారణను మార్చికి వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్ఐబీకి నేతృత్వం వహించిన ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు.
ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ ఇస్తేనే భారతదేశానికి తిరిగి వస్తానని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పును ఈ ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఈ పిటిషన్ పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
వాదనల అనంతరం జస్టిస్ నాగరత్న స్పందిస్తూ..‘కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుడు ప్రభాకర్ రావు విచారణకు సహకరించారు కదా?. మీకు వేరే ఉద్దేశాలు ఉంటే మేం ప్రోత్సహించలేం. ప్రభాకర్ రావును జైల్లో ఉంచాలనేదే మీ ఆలోచన. ప్రభాకర్ రావును మీరు విచారణకు అడిగితే విచారణకు సహకరించమని చెప్పాం. అవసరం అనుకుంటే మళ్లీ విచారణకి పిలిచి ప్రశ్నించవచ్చు. సహకరించమని చెప్తాం. ఇంకా ఎంతకాలం ఈ పిటిషన్ పైన విచారణ జరపాలి’ అని వ్యాఖ్యానించారు.
అయినప్పటకీ ముందస్తు బెయిల్ కు విషయంలో మూడు న్యాయపర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. వీటిని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం.. విచారనను మార్చి 10 న జరుపుతామని కోర్టు విచారణను వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు ప్రభాకర్ రావుకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
