శివసేన పిటిషన్ పై సాయంత్రం సుప్రీం విచారణ

శివసేన పిటిషన్ పై సాయంత్రం సుప్రీం విచారణ

మహారాష్ట్రలో క్షణక్షణం పరిణామాలు మారిపోతున్నాయి. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. రేపు సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష నిర్వహించాలని డెడ్ లైన్ విధించారు గవర్నర్. దీంతో  రేపు ఉదయం 11గంటలకు  మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది.అయితే గవర్నర్ నిర్ణయంపై శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సాయంత్రం 5గంటలకు న్యాయస్థానం విచారణ జరపనుంది.

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ కసరత్తు

బలపరీక్ష కోసం రేపు ముంబైకి వెళుతున్నామని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. అసోం గౌహతిలోని కామాఖ్య అమ్మవారిని నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దర్శించుకున్నారు. మరోవైపు రోజురోజుకు ఏక్ నాథ్ షిండే మద్దతు పెరుగుతోంది. ప్రస్తుతం షిండే  క్యాంపులో 39 శివసేన నేతలు ఉన్నారు. ఇండిపెండెంట్ లు,  ఇతర ఎమ్మెల్యేలు  మరో 10మంది కూడా  షిండే వర్గంలోనే  ఉన్నారు. మరోవైపు షిండే  వర్గంతో కలిసి  బీజేపీ గవర్నమెంట్  ఫామ్ చేసేందుకు కసరత్తు  చేస్తోంది. విమర్శలు,  ప్రతి విమర్శల మధ్య మహా రాజకీయాలు  మరింత హీటెక్కుతున్నాయి. 

అసెంబ్లీలో బలాబలాలు..

ఒక మహారాష్ట్ర శాసనసభలో మొత్తం 288 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో ఒకరు చనిపోగా, మరో ఇద్దరు అరెస్ట్ అయి జైల్లో ఉండటంతో సభ్యుల సంఖ్య 285కు చేరింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 144 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంది.  గతంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు కలిసి మహారాష్ట్ర వికాస్ అఘాడీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మొత్తం 168 సభ్యుల మెజారిటీతో  MVA ప్రభుత్వం ఏర్పడింది. అయితే శివసేలోని 39 మంది ఎమ్మెల్యేలు, మరో 10 మంది ఇండిపెండెంట్లు తిరుగుబాటు చేశారు. దీంతో మహారాష్ట్ర వికాస్ అఘాడీ మెజారిటీ 119కి పడిపోయింది.  ప్రస్తుతం షిండే కూటమిలో 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 113మంది సభ్యుల వాస్తవ బలం ఉండగా షిండే కూటమి మద్దతు ఇస్తే 162కు చేరుకుంటుంది. దీంతో బీజేపీ షిండే వర్గంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.