ఈసీకి అధికారం ఉంది.. బీహార్ ఓటర్ల జాబితా సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఈసీకి అధికారం ఉంది.. బీహార్ ఓటర్ల జాబితా సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటర్ల జాబితా సవరణపై స్టే విధించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాజ్యాంగం ప్రకారం ఈసీకి ఈ ప్రక్రియను నిర్వహించే అధికారం ఉందన్న సుప్రీంకోర్టు.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగించవచ్చని ఈసీకి సూచించింది. ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నెలల ముందు 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' నిర్వహించాలనే ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్రమైన సందేహాలను వ్యక్తం చేసింది. 

ALSO READ | జనాభా లెక్కలు 2027: ప్రింటింగ్ పనులకు టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం

కాగా, బీహార్ ఓటర్ల జాబితా సవరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం (జూలై 10) జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సుధాన్షు ధులియా ధర్మాసనం విచారణ చేపట్టింది. బీహార్‌లో ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై స్టే విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది. 

అఫిడవిట్ దాఖలు చేయడానికి ఎన్నికల కమిషన్‌కు ఇంకా సమయం ఉందని పేర్కొన్న ధర్మాసనం.. కేసు తదుపరి విచారణను 2025, జూలై 28కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డులను చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలుగా పరిగణించాలని ఈసీని ఆదేశించింది.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ నిర్వహించడం సమస్య కాదు.. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ వ్యాయామాన్ని నిర్వహించగలరా అని మాకు తీవ్రమైన సందేహాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. దాదాపు 8 కోట్ల మంది జనాభా ఈ ఇంటెన్సివ్ సమీక్షకు లోబడి ఉండటంతో దీనిని రాబోయే ఎన్నికలతో అనుసంధానించడం సాధ్యమేనా అని ఈసీని ప్రశ్నించింది ధర్మాసనం. 

బీహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియను నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఎందుకు అనుసంధానించాలి..? ఎన్నికలతో సంబంధం లేకుండా ఎస్ఐఆర్ తర్వాత ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది. అనంతరం పిటిషన్ పై విచారణను జూలై 28కి వాయిదా వేసింది ధర్మాసనం. అప్పటి వరకు ఓటర్ల సవరణ జాబితా ముసాయిదాను ప్రచురించవద్దని ఈసీని ఆదేశించింది.