న్యూఢిల్లీ: థర్డ్ లాంగ్వేజ్ పాలసీ నుంచి ఆరో తరగతి విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని సీబీఎస్‌ఈ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది 7, 8, 9వ తరగతి విద్యార్థులకు కల్పించిన మినహాయింపును ఆరో తరగతి విద్యార్థులకూ వర్తింపజేయాలని పేర్కొంది. ఈ థర్డ్ లాంగ్వేజ్ పాలసీని 2027 ఏప్రిల్ 1 నుంచి అమలుచేయాలని కోర్టు స్పష్టం చేసింది. భాషా విధానంలో సడెన్ గా వచ్చిన ఈ మార్పు వల్ల స్టూడెంట్లకు ఫిజికల్ టెక్స్ట్ బుక్స్ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను పేర్కొంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతోందన్నారు. ఉదాహరణకు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్) లోని విద్యార్థులు నాలుగో తరగతి నుంచి స్పానిష్ చదువుతుండగా, ఇప్పుడు వారిని అకస్మాత్తుగా సంస్కృతానికి మార్చారని న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు, ఈ ఏడాది ఆరో తరగతి విద్యార్థులకు ఈ పాలసీ నుంచి మినహాయింపు ఇచ్చే ఉద్దేశం తమకులేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దాదాపు 99% సీబీఎస్‌ఈ స్కూళ్లు థర్డ్ లాంగ్వేజ్పాలసీని అమలు చేశాయని, కేవలం 1.2 శాతం పాఠశాలలు మాత్రమే దీనివల్ల ప్రభావితమయ్యాయని కేంద్రం పేర్కొంది.
అయితే, అకస్మాత్తుగా సీబీఎస్‌ఈ భాషా విధానం మార్చడంపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. సెవెన్త్ క్లాసు స్టూడెంట్లకు ఏ విధమైన ‘సౌలభ్యం’ కల్పించారో, ఆరో తరగతి విద్యార్థులకు కూడా అదే ఉపశమనం ఉండాలని పేర్కొంది. ఈ విషయంపై పిటిషన్ దాఖలు చేసిన స్కూళ్లను సంప్రదించి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు. ‘విద్యార్థులు ఇబ్బంది పడటం మాకు ఇష్టం లేదు, వారికి ఉపశమనం కావాలి’ అని న్యాయమూర్తి జస్టిస్ జాయ్‌మల్య బాగ్చి స్పష్టం చేశారు. ఆరు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
