బాండ్ల నెంబర్లు ఎక్కడ?.. ఎస్​బీఐని నిలదీసిన సుప్రీంకోర్టు

బాండ్ల నెంబర్లు ఎక్కడ?.. ఎస్​బీఐని నిలదీసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఎన్నికల సంఘానికి పూర్తి వివరాలను ఎందుకు ఇవ్వలేదంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ)పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. బాండ్ల నెంబర్లను ఇస్తేనే.. అవి ఎవరు కొన్నారు? ఏ పార్టీకి చేరాయన్నది తేలుతుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీంను ఇదివరకే రద్దు చేసిన సుప్రీంకోర్టు.. గత ఐదేండ్లలో ఈ స్కీం కింద జరిగిన డొనేషన్ల వివరాలన్నింటినీ ఈసీకి వెల్లడించాలంటూ ఎస్​బీఐని ఆదేశించింది. ఈమేరకు ఎస్​బీఐ ఇచ్చిన వివరాలను ఈసీ గురువారం తన వెబ్ సైట్​లో అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లు మాత్రం వెల్లడికాలేదు. దీంతో ఏ పార్టీకి ఎవరి నుంచి ఎంత మొత్తంలో బాండ్లు అందాయన్న వివరాలు గోప్యంగా ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో ఎస్ బీఐ నుంచి ఎలక్టోరల్ బాండ్ల గురించి పూర్తి డేటా రాలేదంటూ ఈసీ తాజాగా దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ఫైవ్ మెంబర్ బెంచ్ విచారణ చేపట్టింది. ఎలక్టోరల్ బాండ్ల నెంబర్లను కూడా ఈసీకి అందజేయాలని ఆదేశించింది. 

ఎస్ బీఐకి నోటీసులు.. 

కోర్టు ఆదేశాల మేరకు బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను అందజేయడం ఎస్​బీఐ అధికారుల డ్యూటీ అని, ఈ విషయంలో అసంపూర్తి డేటాను ఇవ్వడానికి కారణం ఏమిటో వివరణ ఇవ్వాలంటూ ఎస్​బీఐకి సీజేఐ బెంచ్ నోటీసులు జారీ చేసింది. ‘‘బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని మేం మా జడ్జిమెంట్ లో స్పష్టం చేశాం. బాండ్లను ఎవరు, ఏ తేదీన, ఎంతకు కొన్నారు? అవి ఏ రాజకీయ పార్టీకి చేరాయి? అన్నది తెలియజేయాలని ఆదేశించాం. కానీ బాండ్ నెంబర్లను వెల్లడించకపోవడం వల్ల ఏ బాండ్​ను ఎవరు కొన్నారు? అది ఏ పార్టీకి చేరిందన్నది తెలిసే అవకాశం లేకపోయింది. అందుకే బాండ్ల నెంబర్లను కూడా ఎస్​బీఐ అందజేయాల్సిందే” అని బెంచ్ స్పష్టం చేసింది. దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.   

స్వతంత్ర భారత్ లో అతిపెద్ద స్కాం: జైరాం

ఎలక్టోరల్ బాండ్ల స్కీం స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద స్కాం అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఈసీ తన వెబ్ సైట్​లో పెట్టిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ‘ఇది దేశ చరిత్రలోనే పెద్ద స్కాం. దీనిపై మేం సుప్రీంకోర్టుకు వెళతాం’ అని తెలిపారు. 

ఇది ‘చట్టబద్ధమైన లంచం’ స్కీం: చిదంబరం 

రాజకీయ పార్టీలకు లంచాలను చట్టబద్ధం చేసేందుకే ఎలక్టోరల్ బాండ్ల స్కీంను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అన్నారు. ఈ స్కీంలో అధికార బీజేపీ పార్టీనే అతిపెద్ద లబ్ధిదారుగా ఉందన్నారు.

బీజేపీ ఖాతాలను ఫ్రీజ్ చేసి విచారించాలి: కాంగ్రెస్ చీఫ్​ ఖర్గే 

ఎలక్టోరల్ బాండ్ల స్కీంపై ప్రత్యేక విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యేదాకా బీజేపీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలన్నా రు. బాండ్లను కొన్నవారిలో అనేక మందిపై ఎప్పుడూ ఐటీ, ఈడీ, ఇతర సంస్థల దాడులు జరగలేదని.. అందుకే వారిపై అనుమానం కలుగుతోందన్నారు. శుక్రవారం ఖర్గే బెంగళూరులో మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీ ఎప్పుడూ తాను తినను, ఇంకొకరిని తిననివ్వ ను అని చెప్తుంటారు. కానీ ఇప్పుడు బాండ్ల రూపంలో బీజేపీకి 50% డొనేషన్లు వస్తే.. కాంగ్రెస్ కు 11% మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూస్తే.. బీజేపీని తప్ప తాను ఎవరినీ తిననివ్వననేది ప్రధాని నరేంద్ర మోదీ మాటల అర్థమని తేలిపోతోంది” అని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.