V6 News

లివ్‌‌‌‌ ఇన్ రిలేషన్‌‌‌‌ షిప్‌‌‌‌లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

లివ్‌‌‌‌ ఇన్ రిలేషన్‌‌‌‌ షిప్‌‌‌‌లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
  • సహజీవనం చేసి బిడ్డను కని ఇప్పుడు రేప్ కేసు పెట్టుడేంది ?
  • లివ్‌‌‌‌ ఇన్ రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
  • బంధం విఫలమైనంత మాత్రాన దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం
  • మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన

న్యూఢిల్లీ: లివ్ ఇన్ రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరి సమ్మతితో ఏర్పరుచుకున్న బంధం నుంచి ఒకరు బయటకు వచ్చినంత మాత్రాన అది నేరం కిందకు రాదని స్పష్టం చేసింది. తనను పెండ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడ్డాడని పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌పై ఆరోపణలు చేస్తూ ఓ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. లివ్ ఇన్ రిలేషన్‌‌‌‌షిప్, లైంగిక దాడులకు మధ్య ఉన్న తేడాను ప్రస్తావించారు. ‘‘ఈ కేసు లివ్ ఇన్ రిలేషన్‌‌‌‌షిప్‌‌‌‌కు సంబంధించినది. ఆమె పెండ్లి చేసుకోకుండానే సదరు వ్యక్తితో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు అత్యాచారం, దాడి అని ఆరోపిస్తోంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

పరస్పర అంగీకారంతో ఏర్పడిన బంధం లైంగిక వేధింపుల ఫిర్యాదుగా ఎలా మారుతుంది. లివ్-ఇన్ రిలేషన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లలో ఇలాగే జరుగుతోంది. ఏండ్ల తరబడి కలిసి ఉంటారు. విడిపోయిన తర్వాత ఆ మహిళ.. పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై లైంగిక దాడి కేసు పెడుతుంది. పెండ్లి ప్రస్తావన లేకుండా ఏర్పడిన బంధాల్లో తలెత్తే సమస్యలు ఇవి’’ అని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.

పిటిషన్ విచారణ సందర్భంగా బాధితురాలి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆమెను18 ఏండ్ల వయసులో నిందితుడు కలిశాడని, పెండ్లి చేసుకుంటానని నమ్మించాడని తెలిపారు. అయితే, అప్పటికే అతడికి నలుగురు భార్యలు ఉన్నారని, ఆ విషయం బాధితురాలికి తెలియదని పేర్కొన్నారు.

నిందితుడు గతంలో ఇతర మహిళలను కూడా ఇలాగే వంచించాడని చెప్పారు. అయితే, తాము మాత్రం ఈ కేసుకు మాత్రమే పరమితమవుతామని జడ్జి స్పష్టం చేశారు. బాధితురాలి పరిస్థితిపై న్యాయమూర్తి సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె తన బిడ్డ కోసం భరణం కోరవచ్చని సూచించారు. 

కానీ, లివ్-ఇన్ రిలేషన్‌‌‌‌‌‌‌‌షిప్ విఫలమైందన్న కారణంతో అది క్రిమినల్ నేరం కాబోదని తేల్చి చెప్పారు. ‘‘బంధం అక్రమమైనది కావొచ్చు. కానీ, ఆ బంధం వల్ల కలిగిన బిడ్డ మాత్రం అక్రమం కాదు. పెండ్లి చేసుకుని ఉంటే ఆమెకు హక్కులు మెరుగ్గా ఉండేవి” అని పేర్కొన్నారు. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకు సూచించారు.