
- హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా మేం విచారించలేం
- అక్కడ స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు రావడమేమిటి?
- పిటిషనర్ వంగ గోపాల్‌రెడ్డిని నిలదీసిన ధర్మాసనం
న్యూఢిల్లీ, వెలుగు:
42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై హైకోర్టులో రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున తాము విచారించలేమని తేల్చిచెప్పింది. ‘‘ప్రస్తుతం విచారణ పరిధి హైకోర్టులో ఉంది. అక్కడే తేల్చుకోవాలి.
హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు రావడమేమిటి?” అని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత నెల 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని తీసుకువచ్చింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ అదే నెల 29న వంగ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వ జీవోతో తనకు నష్టం జరుగుతుందని పిటిషన్లో ఆయన పొందుపరిచారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్లు సిద్దార్థ దవే, అభిషేక్ మను సింఘ్వీ, ఏడీఎన్ రావు హాజరయ్యారు.
ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారు?
తొలుత పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ప్రభుత్వం తరఫు అడ్వకేట్ ఏడీఎన్ రావు జోక్యం చేసుకొని... ఇదే అంశంపై హైకోర్టులో రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు నివేదించారు.
ఈ వాదనలపై జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందిస్తూ... ‘‘హైకోర్టు స్టే ఇవ్వకపోతే... ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకు వస్తారా? అసలు 32 ప్రకారం పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారు’’ అని పిటిషనర్‌ను ప్రశ్నించారు. మరోసారి పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ... దసరా సెలవులకు ముందు, హైకోర్టు చివరి పని దినం రోజు ముగిశాక శుక్రవారం(గత నెల 26న) సాయంత్రం లోకల్‌బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని తీసుకొచ్చిందని తెలిపారు.
ఈ జీవోను సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ చాలెంజ్ చేశామన్నారు. అయితే, ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం జీవోపై స్టే ఇవ్వలేదని తెలిపారు. అందువల్లే రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో 9 ప్రకారమే ఈ నెల 9 నుంచి స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ మొదలవుతుందని పిటిషనర్ తరఫు అడ్వకేట్ తెలిపారు. అందువల్ల స్టే ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్లు కోరారు. అదేవిధంగా, ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లపై ఈ నెల 8న హైకోర్టు విచారణ చేపట్టనుందని పేర్కొన్నారు.
ఈ వాదనలతో ఏకీభవించని సుప్రీంకోర్టు ధర్మాసనం.. పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టుకు ఎలా వస్తారని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. ఈ అంశంపై హైకోర్టులోనే రెండు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నందున అక్కడే తగిన ఉత్తర్వులు పొందాలని సూచించారు. విచారణ పరిధి రాష్ట్ర హైకోర్టు పరిధిలోనిదని తేల్చిచెప్పారు. పిటిషన్ ను ఉప సంహరించుకునేందుకు పిటిషనర్ కు స్వేచ్ఛను ఇస్తూనే డిస్మిస్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
హైకోర్టు స్టే ఇవ్వకపోతే...
ఆర్టికల్ 32 కింద
సుప్రీంకోర్టుకు వస్తారా?
అసలు 32 ప్రకారం
పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారు?