
అయోధ్యలో వివాదాస్పద స్థలంలోనే కాదు, చుట్టుపక్కల ఆలయాల్లోనూ పూజల నిర్వహణకు అనుమతించబోమని, తుది తీర్పు వచ్చేదాకా యథాస్థితి కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రామజన్మ భూమికి సమీపంగా ఉన్న 9ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు అనుమతించాలంటూ పండిత్ అమర్నాథ్ మిశ్రా వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల బెంచ్ శుక్రవారం కొట్టేసింది. అలహాబాద్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను బెంచ్ పరిశీలిస్తున్నది. శుక్రవారం నాటి విచారణలోజడ్జిలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతిసారి ఏదోఒకటి చేయాలని చూస్తారెందుకు? దేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరా?” అంటూ పిటిషనర్‌పై మండి పడ్డారు. అయోధ్య వివాద పరిష్కారం కోసం కోర్టు, గత మార్చిలో జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వచ్చేనెలలో కమిటీ తుది నివేదిక సమర్పించనుంది.