
- పర్యావరణ పరిరక్షణ, డెవలప్‌మెంట్.. బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలని సూచన
- ఉత్తరాదిలో విపత్తుల అంశంపై విచారణ
- కేంద్రం, ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాలకు నోటీసులు
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమంగా పెద్ద ఎత్తున చెట్లను నరుకుతుండడం కారణంగానే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలపై అనామిక రాణా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పర్యావరణ విధ్వంసంపై బెంచ్ కీలక కామెంట్లు చేసింది. ‘‘ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్‌లో భారీ వరదలు రావడం, కొండచరియలు విరిగిపడటం మనం చూస్తున్నాం. వరదల్లో పెద్ద ఎత్తున దుంగలు తేలియాడుతూ కొట్టుకుపోవడాన్ని మీడియా రిపోర్టుల్లో గమనించాం. ప్రాథమిక ఆధారాలను బట్టి అవన్నీ అక్రమంగా నరికిన చెట్లకు సంబంధించిన దుండగలేనని అర్థమవుతున్నది. ఇది చాలా తీవ్రమైన అంశం” అని బెంచ్ పేర్కొంది. ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. పంజాబ్‌లో భారీగా వరదలు వచ్చి పంటలు మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉందని తెలిపింది. పర్యావరణ పరిరక్షణ, డెవలప్‌మెంట్.. రెండూ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘‘మేం ప్రకృతి పరిరక్షణ విషయంలో చాలా వరకు జోక్యం చేసుకున్నాం. అదిప్పుడు తిరిగి ప్రతిఫలం ఇస్తున్నది. నేను ఈరోజు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీతో మాట్లాడతాను. ఆయన రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో మాట్లాడతారు” అని చెప్పారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ..
దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలు ఇంకా అనేక చోట్ల అమలు కావడం లేదంటూ మీడియాలో వార్తలు రావడంతో, ఈ అంశాన్ని సుమోటో విచారణకు స్వీకరించింది.
ఫార్మా రంగంలో అసలు సమస్య అదే..
దేశంలో మెడిసిన్స్ మార్కెటింగ్ విషయంలో ఫార్మా కంపెనీలు అనైతిక పద్ధతులు అవలంబించకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే సరైన నిబంధనలు ఉన్నాయని.. కానీ అవి అమలవుతున్నాయా? లేదా? అనేదే అసలు సమస్య అని పేర్కొంది.
ఆ క్యాడెట్లకు ఈసీహెచ్ఎస్..
మిలటరీ ట్రైనింగ్‌లో అంగవైకల్యానికి గురైన కారణంగా ఆర్మీ నుంచి తప్పించిన క్యాడెట్స్‌కు ఎక్స్–సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్‌ఎస్) కింద వైద్య సదుపాయం కల్పిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే ఆ క్యాడెట్స్ అందరినీ స్కీమ్‌లో చేర్చామని తెలిపింది. వీళ్లకు జాయినింగ్ ఫీజు కింద చెల్లించాల్సిన రూ.1.20 లక్షలు కూడా మాఫీ చేశామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించిన కోర్టు.. ఈ అంశంలో అమికస్ క్యూరీగా సీనియర్ అడ్వకేట్ రేఖా పల్లీని నియమిస్తున్నట్టు తెలిపింది.