'కర్లీస్ రెస్టారెంటు'కు సుప్రీం ఊరట

'కర్లీస్ రెస్టారెంటు'కు సుప్రీం ఊరట

హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మరణం తర్వాత చర్చనీయాంశమైన గోవాలోని 'కర్లీస్' రెస్టారెంట్ కూల్చివేత ప్రక్రియను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై నిర్ణయం తీసుకునే వరకు ఆ రెస్టారెంట్ ను మూసివేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఇచ్చిన ఆదేశాల మేరకు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ.. ఆ హోటల్ ను కూల్చివేయాలని ఆదేశించింది. దీంతో గోవా ప్రభుత్వం కూల్చివేత ప్రక్రియను చేపట్టింది.

ఈ రోజు ఉదయం కర్లీస్ రెస్టారెంట్ కూల్చివేత కోసం ఆ ప్రాంత పరిసరాల్లో  భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి 'నో డెవలప్‌మెంట్ జోన్'లో నిర్మించిన రెస్టారెంట్‌ను కూల్చివేసేందుకు జిల్లా యంత్రాంగం ఆ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు స్క్వాడ్ పోలీసు సిబ్బందితో కలిసి ఉదయం 7.30 గంటలకు బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో కర్లీస్ రెస్టారెంట్ కు కాస్త ఊరట లభించింది. ఇక గోవాలోని ప్రసిద్ధ అంజునా బీచ్‌లో ఉన్న ఈ రెస్టారెంట్ ఇటీవల బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతి కేసులో కీలకంగా మారింది. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు అక్కడే పార్టీ చేసుకోవడంతో ఇప్పుడిప్పుడే కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఈ కేసులో అరెస్టయిన నలుగురిలో ఈ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్ కూడా ఉండడంతో విషయం మరింత సీరియస్ గా మారింది. అయితే తదనంతరం ఆయనకు బెయిల్ మంజూరైంది.