- మిస్సింగ్ కేసులు పెద్ద సమస్యగా మారుతున్నాయి
- చిన్నారుల దత్తత ప్రక్రియను సులభతరం చేయండి
- విచారణ కోసం జిల్లాకో నోడల్ఆఫీసర్ను నియమించాలి
- వచ్చే నెల 9 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలి
- మిస్సింగ్ కేసుల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రానికి ఆదేశం
న్యూఢిల్లీ: దేశంలో చిన్నారుల మిస్సింగ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ప్రతి 8 నిమిషాలకో చిన్నారి తప్పిపోతున్నారని న్యూస్ పేపర్స్ లో వచ్చిన కథనాలను ప్రస్తావించింది. ఇది అతిపెద్ద సమస్యగా మారిపోతున్నదని పేర్కొన్నది. కేంద్ర సర్కారు తక్షణమే తప్పిపోయిన పిల్లలను గుర్తించే వ్యవస్థను మెరుగుపరచాలని, దత్తత ప్రక్రియను సులభతరం చేయాలని ఆదేశించింది. దేశంలో పిల్లలను దత్తత తీసుకునే విధానం పెరిగిపోయిందని, ఈ ముసుగులో చిన్నారుల అక్రమ రవాణా, అమ్మకాలు ఎక్కువ అయ్యాయని ఓ ఎన్జీవో వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. దేశంలో దత్తత ప్రక్రియ కఠినంగా ఉన్నదని, దీంతో సంతానం లేనివారు చట్టవిరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటున్నారని పేర్కొంది. దత్తత ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు అక్రమ దత్తతను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
నోడల్ ఆఫీసర్‌ను నియమించాల్సిందే..
తప్పిపోయిన చిన్నారుల కేసులపై విచారణ చేపట్టడానికి నోడల్ అధికారిని నియమించడానికి ఆరు వారాల సమయం ఇవ్వాలని కోర్టును కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోరారు. అందుకు నిరాకరించిన బెంచ్.. డిసెంబర్ 9 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. ఆ విషయంలో ఆలస్యం పనికిరాదని వార్నింగ్ ఇచ్చింది. మిస్సింగ్ కేసులను నిర్మూలించడానికి ఇప్పటివరకు ఏంచర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలని పేర్కొన్నది. కాగా, తప్పిపోయిన పిల్లలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని, ఆ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని గతనెల 14న కేంద్రానికి కోర్టు సూచించింది.
వారి పేర్లు, సంప్రదింపు వివరాలను ‘మిషన్ వాత్సల్య’ పోర్టల్‌లో ప్రచురించాలని పేర్కొంది. పిల్లలను కిడ్నాప్ చేసే నేరస్తులపై పోర్టల్‌లో వచ్చే ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవచ్చని, ఇది నోడల్ ఆఫీసర్లకు ఉపయోగపడుతుందని తెలిపింది. చిన్నారుల మిస్సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ‘గురియా స్వయం సేవి సంస్థ’ అనే ఎన్జీవో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
మిస్సింగ్, అపహరణ, ట్రాఫికింగ్‌కు గురైన పిల్లల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఖోయా/-పాయా’ పోర్టల్‌లో ఉన్న సమాచారం ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. నిరుడు యూపీలో నమోదైన 5 కేసుల వివరాలను ఈ సంస్థ కోర్టుకు సమర్పించింది. ఈ ఘటనల్లో మైనర్లను కిడ్నాప్ చేసి, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సహా ఇతర రాష్ట్రాలకు రవాణా చేశారు. ఈ కేసులు బాలల ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లు ఎంత వ్యవస్థీకృతంగా, విస్తృతంగా ఉన్నాయో చూపిస్తున్నాయని, దీనిపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో స్పందించేలా కోర్టు ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
