ఎంపీ బీబీ పాటిల్‌‌కు సుప్రీంకోర్టులో షాక్

ఎంపీ బీబీ పాటిల్‌‌కు సుప్రీంకోర్టులో షాక్

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌‌కు సుప్రీంకోర్టు షాక్‌‌ ఇచ్చింది. తనపై నమోదైన నేరాలను ఎన్నికల అఫిడవిట్‌‌లో దాచారని ఆరోపిస్తూ బీబీ పాటిల్‌‌పై అనర్హత పిటిషన్‌‌ దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌‌ను ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌‌ చేయగా, తాజాగా కొట్టేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల అఫిడవిట్‌‌లో బీబీ పాటిల్ తనపై ఉన్న కేసుల విషయాన్ని దాచారని ఆయన చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి కె.మదన్ మోహన్ రావు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌‌ను విచారించిన హైకోర్టు.. రోజువారీ విచారణ చేపడతామని ఈ ఏడాది మార్చి 17న తీర్పు ఇచ్చింది. కాగా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీబీ పాటిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో తదుపరి విచారణ చేపట్టే వరకు హైకోర్టులో ఈ కేసు విచారణపై స్టే విధించింది. ఈ పిటిషన్‌‌పై పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈనెల 3న వాదనలను ముగిస్తూ, తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం జస్టిస్ ఎస్ రవీంద్రభట్, జస్టిస్ అరవింద్ కుమార్‌‌‌‌ బెంచ్‌‌ తీర్పును వెల్లడించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీబీ పాటిల్ పెట్టుకున్న అప్పీల్‌‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. దీం తో ఆయన అనర్హత పిటిషన్‌‌పై తెలంగాణ హైకోర్టు రోజువారీ విచారణ తిరిగి ప్రారంభం కానుంది.