కాకతీయ ఓపెన్ మైనింగ్​కు సుప్రీం గ్రీన్ ​సిగ్నల్

కాకతీయ ఓపెన్ మైనింగ్​కు సుప్రీం గ్రీన్ ​సిగ్నల్

భూపాలపల్లి జిల్లా కాకతీయ ఓపెన్ కాస్ట్ గనిలో మైనింగ్ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చింది. అయితే గనిలో పేలుళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత సింగరేణి కాలరీస్ మేనేజ్​మెంట్​దేనని స్పష్టం చేసింది. బొగ్గు తవ్వకం కోసం నివాసాలకు 150 మీటర్ల దూరంలో మైనింగ్‌, బ్లాస్టింగ్‌ చేసుకోవచ్చంటూ కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులను నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యూన‌ల్ నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం వేసిన పిటిషన్.. గురువారం  ధర్మాసనం విచారించింది. మైనింగ్ వల్ల ఆ ప్రాంతంలో వాయు, జల, శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తన నివేదికలో పేర్కొందని పిటిషనర్ల తరఫు లాయర్ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. స్పందించిన బెంచ్.. మైనింగ్ వల్ల ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉందని చెప్పింది. మైనింగ్ పేలుళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, భూ సేకరణలో కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలు పాటిస్తామని సింగరేణి తరఫు  లాయర్ విన్నవించారు. కేంద్ర పర్యావరణ శాఖ తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ కూడా వాదనలు వినిపించారు. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకున్న బెంచ్… మైనింగ్ చేపట్టేందుకు అనుమతులు ఇచ్చింది. పర్యావరణ నిబంధనల అమలు విషయంలో సింగరేణి నిర్లక్ష్యం వహిస్తే బాధితులు నేరుగా సుప్రీంను ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.