సామాన్యుడి కోసమే సుప్రీంకోర్టు.. లిటిగేషన్ వ్యయం తగ్గించడమే నా ప్రాధాన్యం.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడి

సామాన్యుడి కోసమే సుప్రీంకోర్టు.. లిటిగేషన్  వ్యయం తగ్గించడమే నా ప్రాధాన్యం.. 	సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడి

న్యూఢిల్లీ: సామాన్యుడి కోసమే సుప్రీంకోర్టు ఉందని భారత చీఫ్​ జస్టిస్  సూర్యకాంత్  అన్నారు. పెండింగ్  కేసుల సత్వర పరిష్కారం, లిటిగేషన్  వ్యయాన్ని తగ్గించడమే తన ఫస్ట్  ప్రయారిటీ అని ఆయన తెలిపారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్  టైమ్స్  లీడర్ షిప్  సమిట్ లో ఆయన మాట్లాడారు. పెండింగ్  కేసుల సత్వర పరిష్కారం కోసం యునిఫైడ్  నేషనల్  జుడీషియల్  పాలసీ ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతిఒక్కరికీ న్యాయం దక్కాలని పేర్కొన్నారు. 

‘‘పెండింగ్  కేసులను ఒక్కసారిగా పరిష్కరించడం సాధ్యం కాదు. అది జరగదు కూడా. ఎందుకంటే, రోజూ కొత్త కేసులు దాఖలవుతూనే ఉంటాయి. మరోవైపు ఎప్పుడెప్పుడు పరిష్కారం అవుతాయా అన్నట్లు పాత కేసులు ఎదురుచూస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పెండింగ్  కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి ఒక టైమ్ లైన్  అనేది ఉండాలి. ఇందుకోసం యునిఫైడ్  నేషనల్  జుడీషియల్  పాలసీ తెస్తే బాగుంటుంది. అలాగే, పాత కేసుల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం అనేది ఒక గేమ్ చేంజర్ లా ఉంటుంది. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఇంకా నమ్మకం ఉంది” అని సీజేఐ వ్యాఖ్యానించారు. 

అధికార విభజన గురించి అడగగా.. మన రాజ్యాంగం అధికార విజభనను చాలా అందంగా నిర్వచించిందన్నారు. జ్యుడీషరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్  ఇలా ఏ వ్యవస్థకు ఉండాల్సిన అధికారం ఆ వ్యవస్థకు ఉందని గుర్తుచేశారు. అదే సమయంలో ఒక వ్యవస్థను మరో వ్యవస్థ దాటిపోకూడదన్నారు. వచ్చే కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో కొన్ని సంస్కరణలను దేశం చూడబోతున్నదని ఆయన వెల్లడించారు. లిటిగేషన్లకు ప్రాధాన్యం ఇచ్చేలా ఆ సంస్కరణలు ఉంటాయని ఆయన తెలిపారు.