న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకే స్పీకర్‌కు ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని.. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. స్పీకర్‌కు ఇదే చివరి అవకాశమని వ్యాఖ్యానించింది. అనంతరం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహరంపై శుక్రవారం (జనవరి 16) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టగా తెలంగాణ స్పీకర్ తరుఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకున్నారని ఆయన కోర్టుకు తెలియజేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల పిటిషన్లపై నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు 4 వారాల సమయం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. స్పీకర్‌కు ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని.. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యానించింది. స్పీకర్‌కు ఇదే చివరి అవకాశమని హెచ్చరించింది. పిటిషన్ల విచారణలో రెండు వారాల్లో పురోగతి చూపిస్తే.. నాలుగు వారాల సమయం ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తీసుకున్న చర్యల అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, పార్టీ ఫిరాయించారనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. ఇందులో ఏడుగురు ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు స్పీకర్. వాళ్లు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. వారిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
