
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి సిట్ అధికారులు అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనని ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. తన ఫోన్ యూజర్ ఐడీ, పాస్ వర్డులు పోలీసులకు ఇవ్వాలని ప్రభాకర్ రావుకు సూచించింది. ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో సమాచారం తీసుకోవాలని సిట్ అధికారులకు సూచించింది. ప్రభాకర్ రావు ఫోన్లో సమాచారం చెరిపేసేందుకు యత్నించినట్లు తేలితే చెప్పాలని.. ఒకవేళ చెరిపివేత యత్నాలు నిజమైతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎస్‌ఐబీ సెంటర్‌లో పలువురి ఫోన్లు అక్రమంగా ట్యాపింగ్ చేసినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. ఇందులో ప్రభాకర్ రావును ఏ1గా చేర్చారు. అయితే ఈ కేసులో అభియోగాల నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, తాను స్వదేశానికి తిరిగి వస్తానని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టు తీర్పును ఈ ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం.. మే 29న సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదని, అందువల్ల ఆయనకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు సిట్ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే సిట్ విచారణకు సహకరించాలని.. కేసుకు సంబంధించిన ఫోన్, ల్యాప్ ట్యాప్ పాస్ వర్డులు పోలీసులకు చెప్పాలని ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది.