కాంట్రాక్టర్‌‌ వద్ద పనిచేసే గుమస్తాను హత్య చేసిన మావోయిస్ట్‌‌లు..ఛత్తీస్‌‌గఢ్‌‌లోని బీజాపూర్‌‌ జిల్లాలో ఘటన

కాంట్రాక్టర్‌‌ వద్ద పనిచేసే గుమస్తాను హత్య చేసిన మావోయిస్ట్‌‌లు..ఛత్తీస్‌‌గఢ్‌‌లోని బీజాపూర్‌‌ జిల్లాలో ఘటన

భద్రాచలం, వెలుగు : ఓ కాంట్రాక్టర్‌‌ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తిని మావోయిస్టులు కిడ్నాప్‌‌ చేసి, హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లా పామేడులో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌‌ప్రదేశ్‌‌కు చెందిన ఇంతియాజ్‌‌ అలీ ఛత్తీస్‌‌గడ్‌‌లో రోడ్డు పనులు చేసే ఓ కాంట్రాక్టర్‌‌ వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. నారాయణపూర్‌‌ జిల్లాలో పనులు ముగిసిన తర్వాత.. ఇంతియాజ్‌‌ ఇటీవలే పామేడుకు వచ్చాడు. అక్కడ ఇంతియాజ్‌‌ను మావోయిస్టులు కిడ్నాప్‌‌ చేసి.. రోడ్డు పనులను ఆపేయాలని కాంట్రాక్టర్‌‌ను బెదిరించారు. తర్వాత కొద్ది సేపటికే యువకుడి గొంతు కోసి హత్య చేశారు. డెడ్‌‌బాడీని చూసిన పామేడు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుమస్తా హత్య విషయాన్ని బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్‌‌ ధ్రువీకరించారు.