రెండో విడత లెక్క తేలింది..యాదాద్రి జిల్లాలో బరిలో 374 మంది సర్పంచ్, 2581 వార్డు అభ్యర్థులు

రెండో విడత లెక్క తేలింది..యాదాద్రి జిల్లాలో బరిలో 374 మంది సర్పంచ్, 2581 వార్డు అభ్యర్థులు
  • పది పంచాయతీలు, 171 వార్డులు ఏకగ్రీవం
  • ఐదు పంచాయతీల్లో పాలకవర్గం ఏకగ్రీవం
  • మూడో విడతలో 602 నామినేషన్లు చెల్లుబాటు

యాదాద్రి, వెలుగు:  రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు విత్​డ్రా ప్రక్రియ ముగిసింది.  దీంతో కొన్ని పంచాయతీల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యారు. ఏకగ్రీవం కాని చోట బరిలో అభ్యర్థులెవరెవరూ ఉన్నారో తేలిపోయింది. వారికి గుర్తులు కేటాయించారు. కాంగ్రెస్​ బలపరిచిన అభ్యర్థుల తరపున ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. 

సర్పంచ్​గా బరిలో 374 మంది

యాదాద్రి జిల్లాలోని భూదాన్​ పోచంపల్లి, భువనగిరి, బీబీనగర్​, రామన్నపేట, వలిగొండ మండల్లాలోని 150 పంచాయతీలు, 1332 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. సర్పంచ్​ పదవులకు 886 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూటినీ అనంతరం 647 సర్పంచ్​ నామినేషన్లు ఓకే అయ్యాయి. వీటిలో నామినేషన్ల విత్​ డ్రా తర్వాత 384 మంది బరిలో మిగిలారు. పది గ్రామాల్లో ఒక్కో నామినేషన్​ తప్ప మిగిలిన వాళ్లు విత్​ డ్రా చేసుకోవడంతో ఆ గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 140 పంచాయతీల్లో 374 మంది పోటీ చేస్తున్నారు. 

వార్డుల్లో 2581 మంది

1332 వార్డులకు 3445 నామినేషన్లు దాఖలయ్యాయి. సక్రమంగా ఉన్న 3218 వార్డు నామినేషన్లలో విత్​ డ్రా అనంతరం 2752 మంది బరిలో నిలిచారు.  వీటిలో  ఒక్కో నామినేషన్​ ఉన్న 171 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 1161 వార్డుల్లో 2581 మంది పోటీ చేస్తున్నారు. 

రెండు విడతల్లో 26 పంచాయతీలు ఏకగ్రీవం

ఈ నెల 11, 14 తేదీల్లో జరిగే మొదటి, రెండో విడత ఎన్నికల్లో 303 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందులో మొత్తంగా 26 పంచాయతీలు ఏకగ్రీమయ్యాయి. వీటిలో 16 పంచాయతీల్లో మొత్తం పాలకవర్గమే ఏకగ్రీవమైంది. 362 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన వారిలో ఎక్కువగా కాంగ్రెస్​ బలపరిచిన అభ్యర్థులే ఉన్నారు. 

ప్రచారం స్పీడప్​

రెండు విడతలకు సంబంధించిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్​ బలపరిచిన అభ్యర్థుల తరపున ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి  ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, బీఆర్​ఎస్​, బీజేపీ, కమ్యూనిస్టుల తరపున ఆయా పార్టీల జిల్లా, మండల లీడర్లు ప్రచారం చేస్తున్నారు. 

ఏకగ్రీవాల్లో 10 ఎస్టీలకు

ఏకగ్రీవమైన వాటిలో ఎస్టీ పంచాయతీలే ఎక్కువగా ఉన్నాయి. మొదటి విడతలోని 16 పంచాయతీల్లో 7, రెండో విడతలో 3 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ఒకటి అన్​ రిజర్వ్​డ్​ స్థానం కూడా ఉంది. ఎస్సీలకు మొదటి, రెండో విడతల్లో కలిపి 4, రెండు అన్​ రిజర్వ్​డ్​తో పాటు మరో మూ డింటిని బీసీలకు దక్కాయి. ఏడు అన్​ రిజర్వ్​డ్​ పంచాయతీల్లో ఓసీలు గెలిచారు. 

మూడో విడతలో 602 చెల్లుబాటు

జిల్లాలోని ఆరు మండలాల్లో మూడో విడతకు సంబంధించిన నామినేషన్ల స్క్రూటినీ ముగిసింది. ఈ విడతలోని 124 పంచాయతీలకు 800 నామినేషన్లు రాగా, 1086 వార్డులకు 3050 నామినేషన్లు వచ్చాయి. స్క్రూటీనిలో ఒకటి కంటే ఎక్కువ వచ్చిన వాటిలో198 పంచాయతీ నామినేషన్లు, 239 వార్డు నామినేషన్లు తొలగించారు.

సర్పంచ్​ అభ్యర్థులు  602, వార్డులకు 2811 నామినేషన్లు అర్హతగా ఉన్నాయి. కాగా సంస్థాన్​ నారాయణపురం మండలంలోని పల్లగట్టుతండా, వాచ్యాతండ, కడపగండి తండాలకు ఒక్కో నామినేషన్​ మాత్రమే దాఖలయ్యాయి. దీంతో ఆయా పంచాయతీల్లో సర్పంచ్​లు ఏకగ్రీవమయ్యారు. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.