న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఇచ్చిన హోమ్ లోన్ల (మోర్టగేజ్ లోన్ల) విలువ ఈ ఏడాది నవంబర్‌లో రూ.9 లక్షల కోట్లు దాటిందని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి అన్నారు. రిటైల్, అగ్రికల్చరల్, ఎంఎస్‌ఎంఈ (ఆర్‌ఏఎం) విభాగం మొత్తం లోన్ పోర్ట్‌ఫోలియో విలువ సెప్టెంబర్‌లో రూ.25 లక్షల కోట్లు దాటిందని తెలిపారు. ఎకానమీ మెరుగ్గా ఉండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14 శాతం క్రెడిట్ గ్రోత్ సాధిస్తామని అంచనావేశారు.
గతంలో వేసిన 12 శాతం నుంచి పెంచారు. ఎంఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో 17–18శాతం, వ్యవసాయం, రిటైల్ సెగ్మెంట్లలో 14 శాతం చొప్పు వృద్ధి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోల్డ్ లోన్, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ (అన్‌సెక్యూర్డ్ పర్సనల్ లోన్) కూడా డబుల్ డిజిట్ వృద్ధి సాధిస్తుందన్నారు. ఎస్‌బీఐ కార్పొరేట్ క్రెడిట్ (కంపెనీలకు ఇచ్చే లోన్లు) ఈ ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్‌లో 7.1శాతం వృద్ధి సాధించింది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో లోన్లు తక్కువ వడ్డీకే దొరుకుతాయని, డిమాండ్ పెరుగుతుందని శెట్టి తెలిపారు.
