అవయవదానంలో ఆగని ప్రైవేట్ దోపిడీ

అవయవదానంలో ఆగని ప్రైవేట్ దోపిడీ
  • ‘తోటా’ పేరుతో కొత్త చట్టం తెచ్చినా ఫలితం సున్నా
  •     8 నెలలుగా గైడ్‌‌లైన్స్ తయారు చేయని అధికారులు
  •     ఎప్పట్లాగే కార్పొరేట్​ఆసుపత్రుల్లోనే బ్రెయిన్​డెత్​డిక్లరేషన్లు, ట్రాన్స్​ప్లాంటేషన్లు
  •     ప్రభుత్వ దవాఖాన్లలో అవయవాలు దొరక్క చనిపోతున్న పేదలు  

హైదరాబాద్, వెలుగు: అవయవదానంలో పారదర్శకతను ప్రవేశపెట్టి, కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీకి చెక్ పెట్టడంతో పాటు పేదల ప్రాణాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ‘ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ అండ్ టిష్యూ యాక్ట్(తోటా)’ కాగితాలకే పరిమితమైంది. అసెంబ్లీలో చట్టం పాస్ చేసి 8 నెలలు గడుస్తున్నా.. దాన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేయాలనే గైడ్‌‌లైన్స్ రూపొందించడంలో అధికారులు విఫలమయ్యారు. ఇదే అదనుగా చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎప్పట్లాగే  దందా కొనసాగిస్తున్నాయి. 

కొత్త గైడ్‌‌ లైన్స్ కోసం జీవన్ దాన్ నోడల్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లతో కలిపి కమిటీ వేసినా.. నెలల తరబడి మీటింగులకే పరిమితం అవుతుండటంతో చట్టం ఉండి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ఫలితంగా నేటికీ బ్రెయిన్ డెత్ కేసులు, ట్రాన్స్‌‌ప్లాంటేషన్లు ప్రైవేట్ హాస్పిటల్స్‌‌లోనే జరుగుతుండగా.. పేదలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవాలు దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. 

కొనసాగుతున్న ప్రైవేట్ దందా 

గతంలో ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ – 1995’ లో అనేక లోపాలున్నాయి. ఈ పాత చట్టం ప్రకారం ఒక ప్రైవేట్ హాస్పిటల్‌‌లో బ్రెయిన్ డెడ్ కేసు నమోదైతే.. ఆ వ్యక్తి నుంచి సేకరించిన గుండె, లివర్, ఒక కిడ్నీ.. అన్నీ ఆ ఆసుపత్రిలోని పేషెంట్లకే చెందుతాయి. కేవలం ఒక్క కిడ్నీ మాత్రమే జనరల్ పూల్(ప్రభుత్వ కోటా)కు ఇస్తారు. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులు తమ పేషెంట్ల దగ్గర ప్యాకేజీల పేరుతో కోట్లు గుంజుతున్నాయి. 

ఈ దందాకు చెక్ పెట్టి.. అవయవాలను అందరికీ సమానంగా పంచేందుకే ప్రభుత్వం పాత చట్టాన్ని రద్దు చేసి, మార్చిలో ‘తోటా’ యాక్ట్‌‌ను ఆమోదించింది. కానీ గైడ్‌‌లైన్స్ రాకపోవడంతో నేటికీ పాత పద్ధతే నడుస్తోంది. ఉచితంగా దొరకాల్సిన అవయవాల కోసం పేదలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి రూ. 40  నుంచి రూ. 60 లక్షలు పెట్టుకోవాల్సి వస్తోంది. అలాగే నిమ్స్, ఉస్మానియాలో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రోగులకు నిరాశే మిగులుతోంది. 

స్వాపింగ్ లేక.. బతికే చాన్స్ కోల్పోతున్నరు..

కొత్త చట్టంలో రోగులకు ఉన్న అతిపెద్ద వరం స్వాపింగ్. అంటే ఒక కుటుంబంలో పేషెంట్‌‌ కు సొంత బంధువుల కిడ్నీ మ్యాచ్ కాకపోతే.. వేరే కుటుంబంతో పరస్పరం మార్చుకునే అవకాశం ఉంది. దాతలు రెడీగా ఉన్నా.. బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ కాక ఆగిపోయిన వందలాది ఆపరేషన్లకు ఇది పరిష్కారం చూపిస్తుంది. కానీ, గైడ్‌‌లైన్స్ రూపొందకపోవడం, జీవన్‌‌దాన్ పోర్టల్‌‌ లో మార్పులు చేయకపోవడంతో ఈ స్వాపింగ్ ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. 

మట్టిపాలవుతున్న టిష్యూలు.. 

కొత్త చట్టం ప్రకారం బ్రెయిన్​డెడ్​అయినవారి నుంచి ఎముకలతోపాటు, చర్మం, గుండె వాల్వ్స్ వంటి టిష్యూలను కూడా సేకరించవచ్చు. కానీ దీనికి సంబంధించిన టిష్యూ బ్యాంకులు, గైడ్‌‌ లైన్స్ లేక విలువైన అవయవాలు మట్టిపాలవుతున్నాయి. అలాగే జిల్లాల్లోని నాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్లలో కూడా బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసే వెసులుబాటు కొత్త చట్టంలో ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అది అమలు కాక.. కేవలం హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రులకే అవయవ దానం పరిమితమైంది. 

పకడ్బందీగా రూల్స్ రూపొందిస్తున్నాం  

గైడ్‌‌లైన్స్ తయారీకి ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లతో కమిటీ వేశాం. ఈ కమిటీ రూపొందించే గైడ్‌‌లైన్స్‌‌ను నేషనల్ టిష్యూ అండ్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ పరిశీలించి సాఫ్ట్‌‌వేర్ అందజేస్తుంది. హడావుడిగా రూల్స్‌‌ రూపొందిస్తే దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. అందుకే చాలా పకడ్బందీగా రూపొందిస్తున్నాం. 
- డాక్టర్ శ్రీభూషణ్ రాజు, జీవన్ దాన్ నోడల్ ఆఫీసర్