సిమ్రన్‌‌‌‌ సూపర్‌..‌‌‌‌‌‌‌ షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ సొంతం

సిమ్రన్‌‌‌‌ సూపర్‌..‌‌‌‌‌‌‌ షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ సొంతం

దోహా: ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో ఇండియా యంగ్ షూటర్ సిమ్రన్‌‌‌‌ప్రీత్ కౌర్ బ్రార్‌‌‌‌‌‌‌‌ గోల్డ్ మెడల్‌‌‌‌తో అదరగొట్టగా.. స్టార్ షూటర్లు ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అనీశ్ భన్వాలా సిల్వర్ మెడల్స్‌‌‌‌తో  సత్తా చాటారు. ఆదివారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌‌‌‌లో సిమ్రన్ స్వర్ణం గెలిచి తన కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే అతి పెద్ద విజయం అందుకుంది. ఫైనల్లో  ఆమె 41 పాయింట్లతో  జూనియర్ వరల్డ్ రికార్డును సమం చేసి టాప్ ప్లేస్ సాధించింది. 

పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సిమ్రన్ క్వాలిఫికేషన్ రౌండ్‌‌‌‌లో 585 స్కోరుతో ఫైనల్‌‌‌‌కు క్వాలిఫై అయింది. అయితే, ఫైనల్లో తనకు సరైన  ఆరంభం లభించలేదు. మొదటి సిరీస్‌‌‌‌లో ఐదు షాట్లలో  మూడుసార్లు టార్గెట్లను మిస్‌‌‌‌ అయిన ఆమె చివరి స్థానానికి (ఎనిమిదో) పడిపోయింది. కానీ  ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న సిమ్రన్  పోటీలో మూడు సార్లు పర్ఫెక్ట్ 5 స్కోర్ చేసింది. 

ఈ క్రమంలో  చైనా టాప్‌‌‌‌ షూటర్, వరల్డ్‌‌‌‌ చాంపియన్ యావో ఖియాన్‌‌‌‌జున్‌‌‌‌కు షాకిచ్చి బంగారు పతకాన్ని గెలుచుకుంది. యావో  36 పాయింట్లుతో రజతంతో సరిపెట్టగా..  జర్మనీకి చెందిన డోరీన్ వెన్నెంకాంప్ (30 పాయింట్లు) కాంస్యం సాధించింది. ఫైనల్‌‌‌‌కు అర్హత సాధించిన  హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ 15 పాయింట్లతో ఏడో స్థానంతో సరి పెట్టింది.  డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ క్వాలిఫికేషన్ రౌండ్‌‌‌‌లోనే నిష్క్రమించింది.  

ప్రతాప్ తొలి ప్రయత్నంలోనే

ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే ప్రతాప్ సింగ్ తోమ్ సిల్వర్ మెడల్‌‌‌‌తో మెరిశాడు. మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో అతను ఈ పతకం సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో 413.3 స్కోరుతో రెండో స్థానంలో నిలిచాడు. కేవలం 0.9 పాయింట్ల తేడాతో స్వర్ణం కోల్పోయాడు.  తొలి నీలింగ్ పొజిషన్ తర్వాత నాలుగో స్థానంలో ఉన్న ప్రతాప్‌‌‌‌  ప్రోన్ పొజిషన్‌‌‌‌లో సత్తా చాటి రెండో స్థానానికి ఎగబాకాడు. స్టాండింగ్ పొజిషన్‌‌‌‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ 33వ షాట్ తర్వాత  టాప్ ప్లేస్‌‌‌‌లోకి వచ్చి గోల్డ్ మెడల్‌‌‌‌పై ఆశలు రేపాడు. 

 చివరి షాట్లకు ముందు కేవలం 0.3 పాయింట్ల తేడా మాత్రమే ఉన్నప్పటికీ  చెక్ రిపబ్లిక్ షూటర్ జిరి ప్రివ్రాట్స్‌‌‌‌కీ  అద్భుతంగా పుంజుకోవడంతో ప్రతాప్ రెండో స్థానంలో నిలిచాడు.  414.2 స్కోరుతో జిరి  గోల్డ్ నెగ్గగా.. చైనాకు చెందిన యుకున్ లి 388.9 స్కోరుతో థర్డ్ ప్లేస్‌‌‌‌తో బ్రాంజ్ ఖాతాలో వేసుకున్నాడు.  కాగా, ఈ విక్టరీతో  ప్రతాప్ సింగ్ షూటింగ్‌‌‌‌లో అన్ని వరల్డ్‌‌‌‌, కాంటినెంటల్ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లో పతకం నెగ్గిన ఘనతను సొంతం చేసుకున్నాడు. 

ఇక, మెన్స్‌‌‌‌ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌‌‌‌లో అనీశ్ భన్వాలా రెండో ప్లేస్‌‌‌‌తో సిల్వర్ నెగ్గాడు. తొలుత షూటాఫ్‌‌‌‌లో వరల్డ్ చాంపియన్ క్లెమెట్ (ఫ్రాన్స్‌‌‌‌)పై పైచేయి సాధించి గోల్డ్ మెడల్ రేసులో నిలిచిన అనీశ్.. 31 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌తో రజతం ఖాతాలో వేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్ చాంపియన్ లి యుయెహంగ్ (చైనా) 33 పాయింట్లతో గోల్డ్ నెగ్గాడు.మరో ఇండియన్ విజయ్‌‌‌‌వీర్ సిద్ధు 21 పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టాడు.