కోర్టు పనివేళలపై సుప్రీం న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

కోర్టు పనివేళలపై సుప్రీం న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

పిల్లలు ఉదయం ఏడింటికే స్కూల్ కు వెళ్తున్నప్పుడు.. కోర్టులు కాస్త ముందుగా పని ఎందుకు ప్రారంభించకూడదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి యూయూ లలిత్ అభిప్రాయపడ్డారు. కోర్టు పని వేళలకు ముందే త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించిన నేపథ్యంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారం కోర్టు ఉదయం 10:30గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. జస్టిస్ లలిత్ ధర్మాసనం ఈ రోజు ఉదయం 9:30గంటలకే కేసుల విచారణ ప్రారంభించింది. ఓ బెయిల్ కేసుకు సంబంధించి కోర్టుకు వచ్చిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టు విచారణ అప్పటికే ప్రారంభంకావడంపై సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు పని ప్రారంభించేందుకు తొమ్మిదిన్నర సరైన సమయమని అన్నారు.

రోహత్గీ వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ యూయూ లలిత్.. చిన్నారులు ఉదయం ఏడింటికే స్కూలుకు వెళ్తున్నప్పుడు జడ్జిలు, లాయర్లు తొమ్మిదిన్నరకు కోర్టు విచారణ ప్రారంభించలేరా అని అన్నారు. సుదీర్ఘ విచారణలు అవసరం లేనప్పుడు కోర్టులు ఉదయం 9గంటలకు పని ప్రారంభించి 11:30కు కొనసాగించాలని, అరగంట బ్రేక్ తీసుకున్న అనంతరం మధ్యాహ్నం రెండింటికి పని ముగించుకోవచ్చని జస్టిస్ లలిత్ అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల సాయంత్రం మరుసటి రోజు ఫైల్స్ స్టడీ చేసే వెసలుబాటు కలుగుతుందని అన్నారు. ఆగస్టు చివరికల్లా ఈ మార్పులు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం సుప్రీం కోర్టు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేసుల విచారణ జరుపుతున్నాయి. సీనియారిటీ దృష్ట్యా జస్టిస్ యూయూ లలిత్ ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ అనంతరం సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26న రిటైర్ కానున్నారు. ఒకవేళ జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపడితే నవంబర్ 8 వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు.