వీధి కుక్కల కేసుతో వరల్డ్ ఫేమస్ అయ్యా ..సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ విక్రమ్ నాథ్

వీధి కుక్కల కేసుతో వరల్డ్ ఫేమస్ అయ్యా ..సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ విక్రమ్ నాథ్

న్యూఢిల్లీ: వీధి కుక్కల కేసు తనను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసిందని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ విక్రమ్ నాథ్ పేర్కొన్నారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం కేరళలోని తిరువనంతపురంలో ‘హ్యూమన్–వైల్డ్‌‌లైఫ్‌‌ కాన్‌‌ఫ్లిక్ట్’ అనే అంశంపై నిర్వహించిన కాన్ఫరెన్స్‌‌లో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నేను చేసిన చిన్న చిన్న పనుల కారణంగా నాకు లీగల్ కమ్యూనిటీలో మంచి పేరుంది. కానీ ఇప్పుడు వీధి కుక్కల కేసుతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ ప్రజల్లో మంచి గుర్తింపు లభించింది. ఈ కేసు నాకు అప్పగించినందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని అన్నారు. ఈ కేసులో తాను ఇచ్చిన తీర్పుకు గాను జంతు ప్రేమికులతో పాటు డాగ్స్‌‌ నుంచి కూడా తనకు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందుతున్నాయని చెప్పారు.

 కాగా, ఢిల్లీలోని వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఆగస్టు 11న సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై వ్యతిరేకత రావడంతో తీర్పును పునఃపరిశీలిస్తామని చెప్పిన చీఫ్‌‌ జస్టిస్ బీఆర్ గవాయ్.. ఈ కేసును జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి అప్పగించారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే విడిచి పెట్టాలని త్రీ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చింది. రేబిస్, విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలను మాత్రమే షెల్టర్లలో ఉంచాలని ఆదేశించింది.