
- జులై 23 కల్లా పర్యావరణం పునరుద్ధారించాలె
- లేకుంటే కార్యదర్శులకూ జైలు తప్పదు
- కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీం కోర్టు
- లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు మొదలు పెట్టిండ్రు
- పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని వ్యాఖ్య
హైదరాబాద్: కంచగచ్చి బౌలి భూముల కేసు విచారణ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై 23 నాటికి పర్యావరణాన్ని పునరుద్ధరించకుంటే సీఎస్ సహా కార్యదర్శులను కూడా జైలుకు పంపాల్సి ఉంటుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? అనేది స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు.
లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చర్యలు మొదలు పెట్టారని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెప్పాలంది. కేంద్ర సాధికార సంస్థ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సమయం కోరారు. జూలై 23 కల్లా ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని కోర్టు తెలిపింది. ఈ మేరకు కేసు విచారణను జులై 23కు వాయిదా వేసింది.