మీరు చర్యలు తీసుకుంటారా? మేం రంగంలోకి దిగాలా? : సుప్రీంకోర్టు

మీరు చర్యలు తీసుకుంటారా?  మేం రంగంలోకి దిగాలా? : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మణిపూర్​లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేదంటే మేమే రంగంలోకి దిగుతాం. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేసింది. ఈ వీడియో చాలా ఆందోళన కలిగించేలా ఉందని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ తెలిపింది. 

మీడియా, సోషల్ మీడియాల్లో వైరల్‌ అయిన వీడియో ఆధారంగా మణిపూర్‌ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి గురువారం విచారణ చేపట్టింది. మే 4వ తేదీన ఈ ఘటన జరిగితే.. ఇప్పటివరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని  ప్రశ్నించింది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ఈ వీడియోను చూసి దేశ  ప్రజలు తీవ్రమైన ఆవేదనకు గురయ్యారని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. 

అలాంటి వీడియోలు పెడ్తే ఏంచేస్తున్నరు?: ట్విట్టర్ పై కేంద్రం ఫైర్ 

మణిపూర్​లో మహిళలను నగ్నంగా తిప్పిన వీడియోలను ట్విట్టర్ తొలగించకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. ట్విట్టర్​పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. వీడియో వైరల్ అవుతున్నా.. డిలీట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ఐటీ నిబంధనలను పాటించాల్సిందే అంటూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటూ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

 లా అండ్ ఆర్డర్‌ సమస్యకు దారితీసే వీడియో అప్​లోడ్ అయితే ట్విట్టర్ యాజమాన్యం ఏం చేస్తున్నదని ప్రశ్నించింది. ఇలాంటి వీడియో పోస్టు చేయడం, దాన్ని డిలీట్ చేయకపోవడం చట్టప్రకారం నేరమని స్పష్టం చేసింది. కాగా,  ఐటీ నిబంధనలు పాటించనందుకు ట్విట్టర్​పై చర్యలు తీసుకోవాలంటూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం.