ఎలక్టోరల్​ బాండ్ల నంబర్లూ చెప్పాలి : సుప్రీంకోర్టు 

ఎలక్టోరల్​ బాండ్ల నంబర్లూ చెప్పాలి  :  సుప్రీంకోర్టు 
  • ఎస్​బీఐకి మరోసారి డెడ్​లైన్ విధించిన సుప్రీంకోర్టు 
  • మార్చి 21లోగా అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం
  • ఆ తర్వాత అఫిడవిట్​దాఖలు చేయండి
  • బ్యాంకు చైర్మన్​కు సూచన
  • కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై ఆగ్రహం

 న్యూఢిల్లీ : ఎలక్టోరల్​ బాండ్ల విషయంలో స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ)కు సుప్రీంకోర్టు మరోసారి అక్షింతలు వేసింది. తమ ఆదేశాల ప్రకారం ఎన్నికల బాండ్ల నంబర్లను ఎలక్షన్​ కమిషన్​ (ఈసీ) కు సమర్పించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్​ అయ్యింది. బాండ్ల నంబర్లతో సహా అన్ని వివరాలను మార్చి 21 సాయంత్రం 5గంటల లోగా ఈసీకి సమర్పించాలని ఆదేశించింది.

అనంతరం  తమ బ్యాంకు ఎలక్టోరల్​ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను బహిర్గతం చేసిందని, ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని సూచిస్తూ  కోర్టుకు అఫిడవిట్​ సమర్పించాలని ఎస్​బీఐ చైర్మన్ కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ‘బాండ్ల విషయంలో ఎస్​బీఐ సెలెక్టివ్​గా ఉండకూడదు. దేన్ని అణచివేయకూడదనే ఉద్దేశంతోనే ఇందుకు సంబంధించి అన్ని విషయాలను బహిర్గతం చేయాలని మేం తీర్పుచెప్పాం’ అని సీజేఐ డీవై చంద్రచూడ్​ వ్యాఖ్యానించారు.

ఏ దాత లేదా ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎన్ని నిధులు ఇచ్చారో స్పష్టంగా తెలియాల్సిందేనని అన్నారు. ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్​,  సీరియల్​ నంబర్లతోసహా అన్ని వివరాలనుఈసీకి సమర్పించాలని  ఎస్​బీఐని  ఆదేశించారు. ఎస్​బీఐ వెల్లడించిన వివరాలను వెబ్​సైట్​లో పెట్టాలని ఈసీకి ఆదేశాలు జారీచేశారు. ‘ఎలక్టోరల్​ బాండ్స్​కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని వెల్లడించాలని మేం కోరుకుంటున్నాం. మీరు  ఇక్కడికి రాజకీయ పార్టీల తరఫున రాలేదని భావిస్తున్నాం. ఈ కోర్టు తీర్పును పాటించాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని ఎస్​బీఐని ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు. 

ఎస్ బీఐ తీరుపై అసహనం..

కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన ఎలక్టోరల్​ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఐదేండ్ల కాలంలో  జారీ చేసిన బాండ్ల వివరాలను నంబర్లతోసహా ఈసీకి సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఎస్​బీఐకి ఆదేశాలు జారీచేసింది. అయితే, ఎస్​బీఐ కేవలం ఎలక్టోరల్​ బాండ్ల వివరాలు మాత్రమే ఈసీకి సమర్పించి, బాండ్ల నంబర్లను వెల్లడించలేదు. ఈ వివరాలనే ఈసీ తన వెబ్​సైట్​లో పొందుపరిచింది. దీనిపై మరో పిటిషన్​ దాఖలుకాగా, కోర్టు విచారణ చేపట్టింది. ఎస్​బీఐ తీరుపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. ఈసారి కచ్చితంగా ఎలక్టోరల్​ బాండ్ల నంబర్లను వెల్లడించాల్సిందేనని ఎస్​బీఐని ఆదేశించింది.

సోషల్​మీడియా కామెంట్లను స్వీకరించాల్సిందే: సీజేఐ

ఎలక్టోరల్​ బాండ్ల వ్యవహారం విషయంలో సుప్పీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సోషల్​ మీడియాలో నడుస్తున్న ప్రచారంపై సీజేఐ చంద్రచూడ్​ స్పందించారు. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్​జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ కోర్టు ముందున్నవారు ఉద్దేశపూర్వకంగా న్యాయస్థానాన్ని ఇబ్బందికి గురిచేస్తూ పత్రికా ఇంటర్వ్యూలు ఇస్తున్నారని, దీంతో కేంద్రం, ఎస్​బీఐపై సోషల్​మీడియాలో ప్రచారం జరుగుతోందని తెలిపారు.

దీనిపై స్పందించిన సీజేఐ.. సోషల్​మీడియాలో నడుస్తున్న ప్రచారాన్ని స్వీకరించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ‘న్యాయమూర్తులుగా మేం చట్టబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం. న్యాయమూర్తులుగా మేం సోషల్​మీడియాలో కూడా చర్చిస్తాం. ఒక సంస్థగా సోషల్​మీడియా వ్యాఖ్యానాలనూ ఎదుర్కొంటాం’ అని వ్యాఖ్యానించారు. ఒకసారి తాము తీర్పు వెలువరించాక అది ప్రజా ఆస్తి అవుతుందని, దానిపై ఎవరైనా కామెంట్​ చేయొచ్చని, దాన్ని తాము అడ్డుకోలేమని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్​ తెలిపారు.

ఎలక్టోరల్​ బాండ్స్​కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని వెల్లడించాలి. మీరు ఇక్కడికి రాజకీయ పార్టీల తరఫున రాలేదని భావిస్తున్నం. ఈ కోర్టు తీర్పును పాటించాల్సిన బాధ్యత మీపై ఉంది. బాండ్ల విషయంలో ఎస్​బీఐ సెలక్టివ్​గా ఉండకూడదు. ఏ దాత లేదా ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎన్ని నిధులు ఇచ్చారో స్పష్టంగా తెలియాల్సిందే. ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్​, సీరియల్​ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఈసీకి సమర్పించాలి.

సుప్రీంకోర్టు