పిటిషన్‌లో కులం, మతం ప్రస్తావన వద్దు: సుప్రీంకోర్టు

పిటిషన్‌లో కులం, మతం  ప్రస్తావన వద్దు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పిటిషన్ పేపర్లలో పిటిషన్‌ దారుడి కులం, మతం వివరాలను ప్రస్తావించే పద్ధతిని ఆపేయాలని దేశంలోని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

పిటిషన్ కాపీలో కులం, మతం వివరాలను ప్రస్తావించడంలో అర్థం లేదని పేర్కొంది. వివాహ వివాదానికి సంబంధించిన ఓ కేసు రాజస్థాన్‌లోని ఫ్యా మిలీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. తమ కేసు విచారణను పంజాబ్‌లోని ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ దంపతులు సుప్రీంను ఆశ్రయించారు.

వారి పిటిషన్లలో కులం పేరు ఉండటాన్ని చూసి సుప్రీం బెంచ్​ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. కులం వివరాలను ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించింది. ఇకపై ఏ కోర్టులోనూ కేసుల పిటిషన్ కాపీలలో  కులం , మతం ప్రస్తావన లేకుండా చూసుకోవాలని హైకోర్టులకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల రిక్వె స్ట్ మేరకు వారి కేసు విచారణను పంజాబ్‌కు బదిలీ చేసింది.