ఆ 8 మందికి జాబ్స్ ఇవ్వండి .. టీఎస్​ఎస్పీడీసీఎల్​కు సుప్రీం ఆదేశం

ఆ 8 మందికి జాబ్స్ ఇవ్వండి .. టీఎస్​ఎస్పీడీసీఎల్​కు సుప్రీం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: టీఎస్ ఎస్ పీడీసీఎల్ ఉద్యోగాల భర్తీలో పలువురు అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సంస్థ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఎస్ పీడీసీఎల్ లో 8 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. సదరన్ డిస్కం 2018లో133 ఏఈ పోస్టులు,114 జేఏఓ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. 

పరీక్షల్లో 80 మార్కులు కోర్ సబ్జెక్టుగా, 20 మార్కులను జనరల్ సబ్జెక్టుగా విభజించి పరీక్ష నిర్వహించారు. అయితే, సమానంగా మార్కులు వచ్చిన అభ్యర్థులకు వారి ర్యాంకును, ఏజ్​ను పరిగణనలోకి తీసుకోకుండా కోర్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ర్యాంకుల్లో ప్రాధాన్యం కల్పించారు. దీంతో సమాన మార్కులు వచ్చిన ఏడుగురు ఏఈ, ఐదుగురు జేఏఓ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

ర్యాంకుల కేటాయింపులో అభ్యర్థుల వయస్సును కాకుండా కోర్ సబ్జెక్టును ప్రాతిపదికగా తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. దీంతో వయస్సు ఆధారంగా ర్యాంకులను నిర్ధారించి అభ్యర్థులకు న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, అప్పటికే ఎంపికై సంస్థలో పనిచేస్తున్న అభ్యర్థులు, ఎస్ పీడీసీఎల్ యాజమాన్యం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. ఆ 8 మందికి ఆరు వారాల్లోపు ఉద్యోగాలు కల్పించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.