న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీలు వైద్యులను ప్రభావితం చేసేందుకు అనుసరిస్తున్న అనైతిక మార్కెటింగ్, ప్రచార పద్ధతులపై సమగ్ర విచారణకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లో కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
వైద్యులకు ఖరీదైన బహుమతులు, విదేశీ ప్రయాణాలు, ఆతిథ్యం, నగదు ప్రయోజనాలు కల్పిస్తూ మందుల సిఫార్సులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
కేంద్ర ప్రభుత్వం తన నివేదికతో పాటు కంప్లయన్స్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోరిన కోర్టు, తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. ఏర్పాటైన కమిటీ తన మొదటి సమావేశం జరిగిన తేదీ నుంచి 2 నెలల్లోపు సంప్రదింపులు పూర్తి చేసి కేంద్రానికి సిఫార్సులు అందజేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఉన్న చట్టపరమైన నిబంధనల సామర్థ్యం, పర్యవేక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియలో అవసరమైన రంగాల నిపుణులు, సంస్థల నుంచి కమిటీ సలహాలు తీసుకోవచ్చు.
