- తదుపరి విచారణ ఈ నెల 23 కు వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీలో ఖాళీగా మిగిలిపోయిన పీజీ మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారంలో ఇరు రాష్ట్రాల మెడికల్ కాలేజీల యాజమాన్యాల పిటిషన్‌పై సమాధానం చెప్పాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ)ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుకు పూర్తిస్థాయి విచారణను ఈనెల 23న చేపడతామని స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ గడువును పొడిగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. కాలేజీ యాజమాన్యాల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 28తో పీజీ మెడికల్ కౌన్సెలింగ్ గడువు ముగిసిందని, అప్పటికి తెలంగాణలో 377, ఏపీలో 246 పీజీ సీట్లు ఖాళీగా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సీట్లలో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నప్పటికీ, గడువు ముగిసిందనే కారణంతో ఎన్‌ఎంసీ కౌన్సెలింగ్‌ను ముగించిందన్నారు. గడువు పెంచాలని కోరుతూ ఫిబ్రవరి 28కి ముందే వర్సిటీలు, కాలేజీలు ఎన్‌ఎంసీకి అభ్యర్థనలు పంపినా స్పందించలేదని.. కానీ కర్ణాటక, మహారాష్ట్రల్లో గడువు పెంచుతూ ఎన్‌ఎంసీ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టుకు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థనను నిరాకరించడాన్ని తప్పుబట్టారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
