అదానీ కంపెనీల్లో తప్పు జరగలేదు : క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు

అదానీ కంపెనీల్లో తప్పు జరగలేదు : క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు

హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో  అదానీ గ్రూప్ కు  సుప్రీంకోర్టులో ఊరట లభించింది.  హిండెన్‌బర్గ్ ఆరోపణలపై  అదానీ గ్రూపునకు  సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ  క్లీన్ చిట్ ఇచ్చింది. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడుతోందంటూ  జర్మనీకి చెందిన హిండెన్ బర్గ్ సంస్ధ ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన  సుప్రీంకోర్టు కమిటీ ...అదానీ గ్రూప్‌ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తేల్చింది. అదానీ గ్రూప్ సంస్థ సెబీ నియంత్రణలో వైఫల్యం చెందిందని తేల్చడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పేర్కొంది. అదానీ గ్రూప్ నుండి ధరల తారుమారు జరగలేదని తెలిపింది. హిండెన్ బర్గ్ రిపోర్టు తర్వాత రిటైల్ పెట్టుబడిదారుల ప్రయోజనాల్ని కాపాడేందుకు అదానీ గ్రూప్ తీసుకున్న చర్యలను సుప్రీంకోర్టు కమిటీ సమర్ధించడం గమనార్హం.

రిటైల్ పెట్టుబడిదారుల  కాపాడేందుకు అదానీ గ్రూప్ అవసరమైన చర్యలు తీసుకుందని సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ పేర్కొంది. అదానీ గ్రూప్ తీసుకున్న ఉపశమన చర్యలు స్టాక్‌ మార్కెట్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడ్డాయని తెలిపింది. ఈ చర్యలతో  అదానీ గ్రూప్ స్టాక్‌లు స్థిరంగా ఉన్నాయని గుర్తుచేసింది. వ్యాపార అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లభించలేదని చెప్పింది. అదానీ గ్రూప్ కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్, సంబంధిత పార్టీల నుండి పెట్టుబడుల విషయంలోనూ ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని అభిప్రాయపడింది. కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌కు సంబంధించి నియంత్రణ వైఫల్యం కూడా ఏమీ లేదని తెలిపింది. 

హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో  అదానీ గ్రూప్‌పై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు  మార్చిలో  ఓ కమిటీ  నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటైంది. దీనిలో సభ్యులుగా ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవధర్, కేవీ కామత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్‌లను చేర్చింది.  ఈ కమిటీ తన నివేదికను ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీనిని సుప్రీంకోర్టు మే 19వ తేదీన  శుక్రవారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

సుప్రీంకోర్టు  నిపుణుల  కమిటీ నివేదికను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వెంటనే అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ధరలు అమాంతం పెరిగాయి. మధ్యాహ్నం సెషన్లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ BSEలో 3.92 శాతం పెరిగి రూ.1962కి చేరుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాప్ రూ.2.22 లక్షల కోట్లకు పెరిగింది. BSEలో మొత్తం 2.24 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇదే సమయంలో అదానీ టోటల్ గ్యాస్ మినహా ఇతర అదానీ గ్రూప్ స్టాక్స్ మధ్యాహ్నం సెషన్‌లో 4శాతం వరకు లాభాలు పొందాయి.  అయితే అదానీ విల్మార్ షేర్లు 4.3 శాతం లాభపడి రూ.394.35 వద్దకు చేరుకున్నాయి.  అదానీ పోర్ట్స్ స్టాక్ 2.75 శాతం  లాభపడి రూ.682.20కి చేరుకుంది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ BSEలో గతం ముగింపు రూ.861.50 నుంచి 3.54 శాతం పెరిగి రూ.892కి చేరుకుంది. అలాగే అదానీ పవర్ స్టాక్ 4.13 శాతం పెరిగింది.  అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్ 2.20 శాతం  పెరిగి రూ.767.90కి చేరుకోవడం విశేషం.