సాయిబాబా విడుదలను ఆపండి.. సుప్రీంలో ఎన్ఐఏ పిటిషన్

సాయిబాబా విడుదలను ఆపండి.. సుప్రీంలో ఎన్ఐఏ పిటిషన్

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో మాజీ ప్రొఫెసర్ జీ.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)  ఆశ్రయించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ముంబయి హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆయన్ను వెంటనే రిలీజ్ చేయాలంటూ కోర్టు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో ఎన్ఐఏ పిటిషన్ వేసింది. సాయిబాబా విడుదలను ఆపాలని కోరింది. అయితే ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేయాలని ఎన్ఐఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వెంటనే ముంబై హైకోర్టు ఆర్డర్స్ పై స్టే ఇవ్వలేమని.. అత్యవసర విచారణ కోసం దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. న్యాయమూర్తులు ఎంఆర్.షా, బేల.ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం శనివారం ఈ కేసును విచారించనుంది. సాయిబాబా కేసు అంశాన్ని రిజిస్ట్రార్ ముందు ప్రస్తావించడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 

మావోలతో కలిసి కుట్రపన్నారన్న కేసులో 2014 మే నెలలో సాయిబాబా, ఓ జర్నలిస్టు, జవహర్ లాల్  నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సహా మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 2017 మార్చిలో గడ్చిరోలి ట్రయల్ కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి వీరు నాగ్ పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జీవితఖైదును సవాల్  చేస్తూ సాయిబాబా సహా మిగతా దోషులు బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. విచారణ చేపట్టిన ధర్మాసనం వీరందరినీ నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది.