ప్రజలను కాస్తంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనియండి: సుప్రీం

 ప్రజలను కాస్తంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనియండి: సుప్రీం

ఢిల్లీలో టాపాసుల నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  పిటిషన్ ను తక్షణమే విచారించాలని పిటిషనర్లు  కోరారు. అయితే ఇప్పటికప్పుడు విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలను కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వాలన్న సుప్రీం..టపాసుల మీద పెట్టే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచించింది.

టపాసుల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. చివరి నిమిషంలో టపాసుల విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించడం ఏకపక్షమని పిటిషనర్ ఆరోపించారు. పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. పలు పిటిషన్లు సుప్రీంలో పెండింగ్ లో ఉన్నందున తాము విచారించలేమని వెల్లడించింది. 

కాలుష్యాన్ని నివారించే ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధిస్తోంది. దీపావళి సందర్భంగా పటాకులు కాలిస్తే 6 నెలల వరకూ జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తామని ఢిల్లీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గోపాల్ రాయ్ హెచ్చరించారు. పటాకులను తయారు చేసినా, నిల్వ చేసినా ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్ లోని సెక్షన్ 9బీ ప్రకారం.. మూడేండ్ల జైలు శిక్ష, రూ. 5 వేల ఫైన్ తప్పవన్నారు.  రెండేండ్లుగా అమలు చేస్తున్నట్లుగానే ఈ ఏడాది దీపావళికి కూడా పటాకులపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం ప్రభుత్వం స్పష్టం చేసింది. దీపావళి పండుగ అనంతరం కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో సుప్రీంకోర్టు 2017లో బాణసంచాపై నిషేధం విధించింది.