- ఆధారాల్లేకుండా అటెండర్‌ను తొలగించడంపై సుప్రీంకోర్టు సీరియస్
- రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత
న్యూఢిల్లీ, వెలుగు: అనారోగ్యంతో ఐదు రోజులు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చిన్న ఉద్యోగికి ఇంత పెద్ద శిక్ష ఎందుకని నిలదీసింది. సమగ్ర విచారణ జరపకుండానే, ఎలాంటి ఆధారాల్లేకుండా అటెండర్‌ను కోర్టు జాబ్ నుంచి తొలగించడం ఏంటని ప్రశ్నించింది. కరీంనగర్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) కె.రాజయ్య తొలగింపుపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
2017లో ఆగస్టు 3 నుంచి 7 వరకు రాజయ్య విధులకు హాజరుకాలేదు. పర్మిషన్ లేకుండా డ్యూటీకి రాకపోవడంతో ఆయనకు మెమో జారీ అయింది. దీంతో హెల్త్ బాగొలేదని, హాస్పిటల్‌లో చేరినట్లు రాజయ్య ఒక ప్రైవేట్ డాక్టర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించారు. అయితే, ఈ సర్టిఫికెట్ తాను ఇవ్వలేదని సంబంధిత డాక్టర్ తెలిపారు. ఈ విషయంలో ఆ ఉద్యోగి ఫోర్జరీ సర్టిఫికెట్‌ను తెచ్చారన్న ఆరోపణతో 2018లో ఆయనను సర్వీసు నుంచి తొలగించారు.
ఈ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు కూడా సమర్థించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాజయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ తెచ్చిన మెడికల్ సర్టిఫికెట్ ఫోర్జరీ అని ఎలా నిర్ధారిస్తారంటూ ప్రశ్నించింది. రెండింటిపై డాక్టర్ సంతకాలు కొంచెం వేరుగా ఉన్నా.. స్థూలంగా ఒకేలా ఉన్నాయని అభిప్రాయపడింది. డాక్టర్ మాటను మాత్రమే నమ్మి, ఎలాంటి ఆధారాల్లేకుండా ఫోర్జరీ అని నిర్ధారణకు రాలేమని చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును, అధికారుల డిస్మిస్ ఆర్డర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ, రాజయ్యను ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించింది. అలాగే, తొలగించిన నాటి నుంచి ఇప్పటి వరకు రావాల్సిన పూర్తి జీతభత్యాలు, అలవెన్సులు 3 వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
